సొంత పనులకు విద్యార్థులను వాడుకున్న టీచర్లు

సొంత పనులకు విద్యార్థులను వాడుకున్న టీచర్లు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విద్యార్థితో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటన బవాన్ బ్లాక్‌లోని పోఖారీ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పాఠశాల సమయంలో ఒక విద్యార్థి, టీచర్ పక్కన నిలబడి చేతికి మసాజ్ చేస్తుండగా.. ఊర్మిళా సింగ్‌ అనే ఆ ఉపాధ్యాయురాలు కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటోంది. మరికొందరు పిల్లలు తమ పనులు తాము చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మసాజ్ ను ఆస్వాదిస్తూ.. మధ్యలో ఇతర పిల్లలపై కూడా అరుస్తూ ఆ టీచర్ కనిపిస్తోంది. క్లాస్‌రూమ్‌లో ఉన్న ఒకరు ఈ వీడియోను చిత్రీకరించి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో  ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. 
 

ఇక ఇదే తరహాలో మరొక ఉపాధ్యాయురాలూ.. విద్యార్థులతో పనులు చేయించుకొని సస్పెండ్ అయ్యారు. మధురలోని టీచర్ పాఠశాలలోనికి రావడానికి విద్యార్థులను వాడుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ పాఠశాల ఆవరణలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో టీచర్ పాఠశాల లోపలికి వెళ్లేందుకు అక్కడున్న విద్యార్థులను పిలిచి, వరద నీటిలో కుర్చీలు వేయించుకున్నారు. అలా ఆ టీచర్ కుర్చీలపై నుంచి నడుచుకుంటూ వెళ్లి... గేటు నుంచి భవనానికి చేరుకున్నారు. ఆ సమయంలో  కుర్చీలు వేసిన విద్యార్థులు ఆ వరద నీటిలోనే ఉండడాన్ని గమనించవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ కావడంతో అధికారులు, ఆ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.