
హైదరాబాద్ చింతల్ బస్తిలోని వీర్ నగర్ లో కాక వెంకటస్వామి మెమోరియల్ హాల్ ని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. 1977లో వెంకటస్వామిగా కేంద్రమంత్రిగా ఉన్నపుడు వాలీ బాల్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో కొత్త భవనం నిర్మించడానికి వెంకటస్వామి ఫౌండేషన్ తరపున ఫండ్స్ ఇచ్చామని చెప్పారు. విద్యార్థులు చదువుకోవడానికి మంచి వాతావరణం క్రియేట్ చేయాలన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి.. ఆర్థికంగా బలపడాలని సూచించారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని కోరారు. విద్య ద్వారానే దళితులు అభివృద్ధి చెందుతారని వివరించారు.
అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా 5 వేల మందికి విద్యను అందిస్తున్నామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు మంచి ర్యాంకులు తెచ్చుకుని.. అన్ని రంగాల్లో స్థిరపడుతున్నారని స్పష్టం చేశారు. స్టూడెంట్స్ కి స్కిల్ డెవలప్ మెంట్ కూడా నేర్పిస్తున్నామని వెల్లడించారు. అంబేద్కర్ విద్యాసంస్థల్లో చదువుకున్న ప్రతీ స్టూడెంట్ కి ఉద్యోగం వచ్చేలా తీర్చిదిద్దుతున్నామని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.