ప్రజలపై చెరగని ముద్ర వేసిన మహానుభావుల సంఖ్య విశ్వవ్యాప్తంగా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారిలో స్వామి వివేకానంద ముందు వరుసలో ఉంటారు. దేశాలను ఏలినవారిని ప్రజలు గుర్తుంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ, ఒక ఆధ్యాత్మిక వేత్త, ఒక సంస్కర్త దేశాధి నేతలను మించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలలో చోటు సంపాదించాడంటే అది వివేకానంద వల్లనే సాధ్యం అయింది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర (గట్టి) సంకల్పం కలిగిన యువత భారతదేశానికి అవసరం’ అని ఒకటిన్నర శతాబ్దాల క్రితమే వివేకానంద పేర్కొన్నారు.
అలాంటి యువత సాయంతో ప్రపంచాన్నే మార్చి వేయవచ్చని ఆయన పేర్కొన్న విషయం నేటికీ చెప్పుకుంటున్నాం. పవిత్రమైన హృదయంతో ఓర్పు, శాంతితో సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడమే అని వివేకానంద బోధించారు. నేటికి ఇది ఆచరణీయమే.
‘నీ వు చేయాల్సిన పనిని చిత్తశుద్ధితో, పవిత్ర హృదయంతో చేయాలి’ అని స్వామి వివేకానంద బోధించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులుగా పనిచేసేవారు వివిధ పోటీ పరీక్షల్లో నెగ్గి వచ్చినవారే కదా! వీరికి ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే డబ్బు నుంచే ప్రభుత్వం వేతనాలు తదితరాలు చెల్లిస్తోంది కదా! మరి నీతిగా, న్యాయంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరుగుతున్నాయా అంటే ‘లేదు’ అని చెప్పుకోవాల్సి రావడం శోచనీయం. అవినీతి నిరోధక శాఖ (అనిశా) దాడుల్లో అనేకమంది ఉద్యోగులు చిక్కుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.
అలాగే అధికారంలో ఉంటున్న పాలకులు అక్రమంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఉంది. అంటే మన సమాజంలో సంపూర్ణ సంస్కరణలు కావాలని స్పష్టం అవుతోంది. ఇలాంటి సంస్కరణలకు యువత నడుం కట్టాల్సిన అవసరం ఉంది. స్వామి వివేకానంద ఆధ్యాత్మికవేత్త అయినప్పటికీ 'మత సహనం' గురించే ఆయన బోధించారు. విశ్వమానవ కల్యాణం గురించి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. 1863 జనవరి 12న జన్మించిన నరేంద్రనాథ్ దత్తా (స్వామి వివేకానంద) 1902 జులై 4న మరణించారు. కేవలం 39 సంవత్సరాలే జీవించినప్పటికి 100 సంవత్సరాల జీవితంలో సగటు మనుషులు చేయలేని అద్భుతాలను వివేకానంద చేశారు.
సర్వమత సమ్మేళనంలో..
1893 సెప్టెంబర్ 17 నుంచి 27 వరకు చికాగోలో (అమెరికా) జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో పాల్గొన్న వివేకానంద తన వాక్చాతుర్యంతో ప్రపంచ మానవాళిని ఆకట్టుకున్నారు. భారతదేశం నుంచి హిందూమత ప్రతినిధిగా ఆ సమావేశాల్లో పాల్గొన్న వివేకానంద సమ్మేళనంలో ప్రసంగించారు. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అంటూ గంభీర స్వరంతో వివేకానంద తన ప్రసంగాన్ని ప్రారంభించగానే సభలో పాల్గొన్న వేలాదిమంది తన్మయత్వంతో కరతాళ ధ్వనులు చేశారు.
గంటకు పైగా సాగిన ఆయన ప్రసంగం ‘పిన్ డ్రాప్ సైలెన్స్" విధానంలో కొనసాగింది. ‘ఎన్ ఆరేటర్ బై డివైన్ రైట్’, ‘గ్రేటెస్ట్ ఫిగర్ ఇన్ ది పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్’ అంటూ పత్రికలు పతాక శీర్షికలతో ఆయన గురించి రాశాయి. విదేశీ ప్రజల గుండెల్లో తన ప్రసంగాల ద్వారా చోటు సంపాదించారు. పశ్చిమ బెంగాల్ బేలూరులో 'రామకృష్ణ మఠం', 'రామకృష్ణ మిషన్' స్థాపించి వివేకానంద ప్రజల్లో నీతి, న్యాయం, ధర్మం నెలకొల్పేందుకు ఆధ్యాత్మిక వేత్తగా, సంస్కరణవాదిగా పనిచేశారు.
నిరుపేదల ఆకలి తీర్చడం, కనీస అవసరాలు తీర్చడంలోఈ సంస్థ పాటుపడుతోంది. దేశవిదేశాల్లో నేడు 200 పైగా కేంద్రాలు నడుస్తున్నాయి. స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని ‘జాతీయ యువ దినోత్సవం’గా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా 1984లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివేకానంద బోధనలు ప్రజల్లో మరీ ముఖ్యంగా యువతలో చైతన్యం కలిగించేందుకు నేటికీ ఉపయోగపడుతున్నాయి. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుద్దాం.
- పి.వి. రమణారావు,సీనియర్ జర్నలిస్ట్
