డబ్బు కోసమే వైసీపీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్.. 24 గంటల తర్వాత సమాచారం

డబ్బు కోసమే వైసీపీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్.. 24 గంటల తర్వాత సమాచారం

ఆయన ఓ  పార్లమెంట్ సభ్యుడు.. ఎంపీ  కుమారుడికి ఇటీవలే  వివాహం జరిగింది. తనకంటూ ప్రైవసీ కావాలనే ఉద్దేశంతో ఓ పెద్ద ఇల్లు నిర్మాణం చేపట్టి కుమారుడికి  గిఫ్టుగా ఇచ్చాడు ఆ తండ్రి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. అనతికాలంలోనే వ్యాపారంలోఅగ్రస్థానంలో నిలిచిన ఆ పార్లమెంటు సభ్యుడు కుమారుడిని కిడ్నాప్ చేసి అడిగినంత డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటే  వారి సినిమా మారిపోతుందనుకున్నాడు కిడ్నాప్ సూత్రధారి హేమంత్.  అయితే ఎంపీ నుంచి ఫిర్యాదు అందుకున్న గంటల్లోనే   కిడ్నాప్ కేసును చేధించారు విశాఖ పోలీసులు.

డబ్బు కోసమే కిడ్నాప్ 

విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్లు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. నిందితులను హేమంత్‌, రాజేశ్‌, సాయిని పట్టుకున్నామని, వారి  నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామని చెప్పారు. కిడ్నాప్‌ ఘటనకు సంబంధించిన వివరాలను  డీజీపీ వెల్లడించారు.  ముగ్గురు నిందితులు ఎంపీ కుమారుడు శరత్‌ ఇంట్లోకి జూన్ 13న వెళ్లి  కట్టేసి కత్తితో బెదిరించారు. మరుసటి రోజున ఎంపీ భార్య జ్యోతిని కుమారుడు శరత్‌తో పిలిపించారు. తర్వాత ఆమెను కూడా కట్టేశారు. ఆడిటర్‌ జీవీ వస్తే ఆయన్ను కూడా కట్టేసి బెదిరించారు  అని డీజీపీ తెలిపారు.  శరత్ ఇంట్లో ఉన్న రూ.15 లక్షలు తీసుకున్నారని, మరో రూ.60 లక్షలను ఖాతా నుంచి బదిలీ చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఆడిటర్ జీవీని కొట్టి బెదిరించి రూ.కోటి వరకు తెప్పించుకున్నారని వివరించారు. కిడ్నాప్‌ గురించిన సమాచారం అందగానే పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారని తెలిపారు.   నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ తెలిపారు. కేవలం డబ్బు కోసమే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేశారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. 

విశాఖపట్నం సాగర్ తీరంలో  పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ  కుమారుడు భార్యను  కిడ్నాప్ చేశారు ఆగంతకులు.  గత కొద్ది రోజులుగా  ఎంపీ కుమారుడు  నివసించే ప్రాంతంలో కిడ్నాపర్   ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. ఆ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న కిడ్నాపర్ ముందుగా ఎంపీ కొడుకును  కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు.  ఈ కిడ్నాప్ లో పోలీసుల ఊహకందని  విధంగా ఎవరినైతే కిడ్నాప్ చేశారో వారింట్లో పై 48 గంటలు బంధించి  కిడ్నాపర్ హేమంత్ తో పాటు మరో ఇద్దరు నిందితులు  కూడా వాళ్లతో  పాటు ఉన్నారు.

సినీ ఫక్కీలో స్కెచ్

విశాఖలో రాజధాని ఏర్పడితే  సీఎం జగన్మోహన్ రెడ్డి నివసించే ప్రాంతపు రోడ్డది.. , నిత్యం పర్యాటకులు ఆ రహదారి నుంచే  అందమైన సముద్రానికి వెళ్లాలి. ఈ ప్రాంతానికి  అతి సమీపంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ  కుమారుడు  శరత్   ఇల్లు ఉంది.  మంగళవారం  ( జూన్ 13)  న  ఇంట్లో శరత్ ఒక్కడే ఉన్నాడని గ్రహించిన కిడ్నాపర్లు ఉదయమే ఆ ఇంట్లోకి ప్రవేశించారు. శరత్ ను  వారి ఆధీనంలో తీసుకున్నారు. యధావిధిగా ఫోన్లు చేస్తున్న వారితో మాట్లాడించారు.  ఎవ్వరికీ అనుమానం కలగకుండా, ఒక్కడినే కిడ్నాప్ చేస్తే  ఎంపీ డబ్బు ఇవ్వడేమో అనే అనుమానంతో ఎంపీ భార్య జ్యోతిని కూడా కిడ్నాప్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశాడు. ఎంతో చాకచక్యంగా కొడుకుతో ఫోన్ చేయించి  తల్లిని అదే ఇంటికి వచ్చేలా కిడ్నాపర్లు సినీ ఫక్కీలో స్కెచ్చేశారు. 

ఎంపీ భార్యకూడా అక్కడకి వచ్చేలా..

శరత్  తల్లి, ఎంపీ భార్య  జ్యోతి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆమెను కూడా వారి గుప్పెట్లో పెట్టుకున్నారు.  ఇక ఆమెకి వస్తున్న ఫోన్లు కూడా మాట్లాడించే అవకాశాన్ని కల్పించారు.  రోటీన్ గానే   ఎంపీ ఎంవీవి సత్యనారాయణ కొడుకు శరత్, భార్య  జ్యోతి తో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు.  బుధవారం ( జూన్ 14) ఎంపీ  ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆయనకు  అనుమానం వచ్చింది. కనీసం తర్వాత అయినా రిప్లై ఇస్తారనుకున్నారు. కాని ఎంతసేపటికి తన భార్య, కుమారుడి వద్ద నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో ఆలోచనలో పడ్డ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ   పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గంటల వ్యవధిలోనే...

ఎంపీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు  గంటల వ్యవధిలోనే  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫోన్ ట్రాక్ చేసి  భీమిలి మండలంలో ఉన్నట్లు కనుక్కున్నారు.  సీపీ  త్రివిక్రవర్మ ఆదేశాలతో ముగ్గురు డీసీపీలు 15 టీములుగా ఏర్పడి  జల్లెడ పట్టారు. వారు పయనిస్తున్న కారును వెంబడించిన  ఎంపీ  భార్య,  కొడుకు శరత్ ను  సురక్షితంగా విశాఖ తీసుకొచ్చారు.  వీరితో పాటు నిందితులను కూడా  విశాఖ కమిషనరేట్ కు తరలించారు.  అయితే కిడ్నాపర్లు  శరత్  ,  ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఎంవివి సత్యనారాయణ లేకపోవడం చూసి కిడ్నాపర్లు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.  హైదరాబాదులో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగమేఘాల మీద విశాఖ చేరుకున్నారు.  తనకు ఎవరితో ఎటువంటి విభేదాలు లేవని కేవలం డబ్బు కోసమే కిడ్నాపర్లు మా కుటుంబాన్ని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు .

కిడ్నాపర్ పై ఇప్పటికే 12 కేసులు

అయితే కిడ్నాపర్ హేమంత్  పై ఇప్పటికే12  కేసులు ఉన్నాయని  జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మారలేదని పోలీసులు అంటున్నారు.  ఏది ఏమైనా విశాఖలో ఈ కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే పోలీసులు కొద్ది గంటల్లోనే కిడ్నాపర్ ను పట్టుకోవడంతో తమ కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో    ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.