
- పాత పింఛన్ అమలు చేసే పార్టీకే ఓటు
- ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ అంశం రాష్ట్ర పరిధిలోనిదేనని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ స్పష్టం చేశారు. ఇటీవల తమ మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు చేస్తామని తెలంగాణ, కర్నాటక ఎన్నికలలో హామీ ఇచ్చిన పార్టీలు.. అధికారంలోకి వచ్చాయని తెలిపారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల దృష్ట్యా, పాట్నాలో ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో పింఛన్ సంఘర్ష్ పేరుతో సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ గెస్టుగా హాజరైన స్థితప్రజ్ఞ మాట్లాడారు. ఇప్పుడు బిహార్ ఎన్నికల్లో సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు చేస్తమని హామీ ఇచ్చే పార్టీలకు ఉద్యోగులు మద్దతు ఇస్తారని తెలిపారు. కేంద్రం ఇటీవల యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) ప్రకటించడంతో, రెండు దశబ్దాలుగా ఉన్న ఎన్ పీఎస్ (న్యూ పెన్షన్ స్కీమ్ )పనికి రానిదని బహిరంగంగా అంగీకరించినట్టు అయిందని చెప్పారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో సంబంధం లేకుండా ఓపీఎస్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో కారకట్ సెగ్మెంట్ సీపీఐ
(ఎంఎల్) ఎంపీ రాజారామ్ సింగ్, ఎన్ఎంఓపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వరుణ్ పాండే, తెలంగాణ సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రెసిడెంట్లు విక్రాంత్, ప్రదీవ్ ఠాగూర్, భరత్ శర్మ తదితరులు పాల్గొన్నారు.