అభివృద్ధి పనులు చేయలేక పోతే రాజీనామా చేయాలి : ఎర్రబెల్లి ప్రదీప్‍రావు

అభివృద్ధి పనులు చేయలేక పోతే రాజీనామా చేయాలి :  ఎర్రబెల్లి ప్రదీప్‍రావు
  • మంత్రి కొండా సురేఖకు వరంగల్  బీజేపీ లీడర్ల సవాల్

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ సిటీ జనాల ఓట్లతో గెలిచి మంత్రిగా అవకాశం పొందిన కొండా సురేఖ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు డిమాండ్‍ చేశారు. శనివారం వరంగల్‍లో మాజీ ఎంపీ సీతారాం నాయక్‍, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‍, కొండేటి శ్రీధర్‍, వన్నాల శ్రీరాములుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 

మేడారం పనుల్లో కమీషన్ల కోసం గొడవలతో రచ్చకెక్కుతున్న మంత్రి కొండా సురేఖ.. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. మొంథా తుఫాన్‍ నష్ట తీవ్రతను చూడటానికి వచ్చిన సీఎం రేవంత్‍రెడ్డిని, హనుమకొండ నుంచి వరంగల్‍కు తీసుకురావడంలో మంత్రిగా ఫెయిల్‍ అయ్యారన్నారు. విపక్షాలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకోవట్లేదన్నారు.

 మాజీ ఎంపీ సీతారాం నాయక్‍ నాయక్‍ మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్‍ ప్రభుత్వంలోని సన్యాసులు.. జనాలతో పాటు తమ మాట వినకపోవడం వల్లే ప్రతిఫలం అనుభవించారని మండిపడ్డారు. మొంథా తుఫాన్‍ హెచ్చరికలతో ఏపీ సీఎం అలెర్ట్  అవడంతో ప్రాణ నష్టం జరగలేదని, రాష్ట్రంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రాణాలు పోయాయన్నారు. ఆరూరి రమేశ్‍ మాట్లాడుతూ.. వరంగల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కేటాయించిన రూ.107 కోట్ల పనులు ఎందుకు చేపట్టలేదో చెప్పాలన్నారు.