మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య లీడర్లు లొంగిపోయారు

మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య లీడర్లు లొంగిపోయారు

వరంగల్‍, వెలుగు: మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య లీడర్లు లొంగిపోయారని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ.రంగనాథ్‍ తెలిపారు. కమాండర్​, డిప్యూటీ కమాండర్లుగా పని చేసిన కాసరనేని రవీందర్‍ అలియాస్‍ అజిత్‍ (30), మడివి సోమిడి అలియాస్‍ కల్పన (25) దంపతులు జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. గురువారం ఆయన దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. పల్నాడు (గుంటూరు) జిల్లా మాచర్ల మండలం కంబంపాడుకు చెందిన రవికుమార్‍ ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతరామరాజు డివిజనల్‍ కమిటీ మెంబర్‍, మణుగూరు ఎల్‍ఓఎస్‍ కమాండర్‍గా ఉన్నాడు.

ఇంటర్‍ లో చదువు ఆపేసిన రవి 2016లో మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై  రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‍ హరిభూషణ్‍ ప్రొత్సాహంతో దళంలో చేరాడు. చర్ల ఏరియా కమాండర్‍ సోడి జోగయ్య నా యకత్వంలో పనిచేశాడు. 2017 డిప్యూటీ కమాండర్‍ స్థాయికి ఎదిగాడు. 2019లో దళంలోనే పని చేస్తున్న సొమిడిని పెండ్లి చేసుకున్నాడు. సోమిడి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బత్తినిపల్లి. ఈమె 2018లో చర్ల ఎల్‍ఓఎస్‍ మెంబర్‍గా, 2020లో ఏసీఎం, మణుగూరు ఎల్‍ఓఎస్‍ డిప్యూటీ కమాండర్​గా పని చేసింది. రవిపై చత్తీస్​గఢ్, ఖమ్మం సరిహద్దుల్లో జరిగిన కాల్పులతో పాటు ఇతర దాడుల్లో పాల్గొన్న కేసులున్నాయి. ఇతడిపై రూ.5 లక్షల రివార్డు ఉండగా, సోమిడిపై 4 లక్షల రివార్డుంది. 

లొంగిపోయి రివార్డులు, పథకాలు తీసుకోండి

మావోయిస్టులవి బూజుపట్టిన సిద్ధాంతాలని.. మావో పుట్టిన చైనాలోనే కనుమరుగైందని సీపీ రంగనాథ్​అన్నారు.   ఒకప్పటిలా జనాల్లో ఉండకుండా, ఇప్పటి టీంలు కేవలం టేబుల్‍ నిర్ణయాలు తీసుకుని వాట్సాప్‍ పోస్టింగులు చేస్తున్నాయని విమర్శించారు. ఇంకా పార్టీలో ఉన్నవారు దీనిని సమీక్షించుకోవాలన్నారు. పోలీసుల వద్ద లొంగిపోయి ప్రభుత్వం అందించే రివార్డులు, ఇతర పథకాలు వినియోగించుకోవాలని సూచించారు. మీడియా సమావేశంలో ఈస్ట్​ జోన్‍ డీసీపీ పుల్లా కరుణాకర్‍, నర్సంపేట ఏసీపీ సంపత్‍రెడ్డి పాల్గొన్నారు.