దళితబంధు విషయంలో ఈటలకు కృతజ్ఞత చెప్పాలి

దళితబంధు విషయంలో ఈటలకు కృతజ్ఞత చెప్పాలి
  • మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ

కరీంనగర్: దళిత బంధు విషయంలో మనమంతా కృతజ్ఞత చెప్పాల్సింది ఈటల రాజేందర్ కు మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పేర్కొన్నారు. ఈటల దయవల్లే దళితులందరికీ పది లక్షల రూపాయలు వస్తున్నాయని, దళిత బంధు రాకపోతే ఆ డబ్బులు ఇప్పించే సత్తా కూడా ఈటలకే ఉందని ఆమె అన్నారు. జమ్మికుంటలో ఈటలకు దళితుల ఆత్మీయ సత్కార సభలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు. పది రూపాయలిస్తే ప్రాణం పోయేంత వరకు విశ్వాసంగా ఉండే జాతి మనది, ఏడేళ్ల కాలంలో ఈ నీచుడు, దళిత ద్రోహి, మాయలపకీర్ దళితుల బతుకల గురించి ఆలోచించలేదని, ఇన్నేళ్లలో దళిత బతుకుల వైపు తొంగి చూడలేదన్నారు. తనతో 18 ఏళ్లపాటు కుడిభుజంగా నడిచిన ఈటల రాజేందర్ గొంతు పిసికేందుకే ఈ దళితబంధు తెచ్చాడని ఆమె ఆరోపించారు. నీవు ఎందరినో మోసం చేయొచ్చు, కానీ మమ్మల్ని మోసం చేస్తే నీకు చావు డప్పు తప్పదని బొడిగె శోభ హెచ్చరించారు. 
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టాడు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేసీఆర్ మూర్ఖుడు పర్సెంటీజీలకు కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టాడని, అలాంటి వ్యక్తికి మన దళితుల మీద ఇవాళ ప్రేమ పుట్టుకు వచ్చిందని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్..  నీవు ఎన్ని నాటకాలు చేసినా.. దళితులంతా ఈటలవైపే ఉంటారు.. టీఆర్ఎస్ కు కండువా వేసుకున్నోళ్లు కూడా ఈటలకే ఓటు వేస్తామని చెబుతున్నారు.. ప్రజల గుండెళ్లో నాటుకుపోయిన ఈటలను కదిలించడం నీ తరం కాదు..’’ అని బొడిగె శోభ పేర్కొన్నారు. వందల కోట్లతో సభ నిర్వహించి కేవలం 15 మందికే చెక్కులిచ్చిపోయాడు, ఈటలపై కక్షతో ఇక్కడికొచ్చాడు తప్ప.. మనపై ప్రేమతో కాదన్నారు. రెండేళ్ల కిందనే దళిత బంధు ఆలోచన వచ్చిందని చెబుతున్న కేసీఆర్.. కనీసం ఏడాది కిందైనా ఎందుకు ప్రారంభించలేదరని ఆమె ప్రశ్నించారు.  
మంచి మెజార్టీతో ఈటలను గెలిపిస్తేనే దళితులు నిజాయితీ పరులన్న పేరు వస్తుంది
ఈటల రాజేందర్ ను మంచి మెజారిటీతో గెలిపిస్తేనే దళితులు నిజాయితీపరులన్న పేరు వస్తుందని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరదలొస్తే తండ్రీ కొడుకులు పదివేల రూపాయల పేరిట నాటకమాడారని గుర్తు చేస్తూ.. అలాంటోళ్లు ఇప్పుడు పదిలక్షలు ఇస్తామంటే నమ్ముతామా? అని నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మెచేసి 50 మంది చనిపోతే.. రూపాయి పెంచడానికి కూడా మనస్సు రాని సీఎం కేసీఆర్ ఇప్పుడు మనకు డబ్బులిస్తానంటే నమ్ముదామా? అని ప్రశ్నించారు. మనకు ఇస్తానన్న మూడెకరాల భూమి సహా ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ఇక్కడున్న 20 వేల కుటుంబాలకు దళితబంధు వచ్చేలా ఉద్యమం చేద్దామని బొడిగె శోభ పిలుపునిచ్చారు.  
మూడెకరాల హామీ కింద మరో 30 లక్షలు ఇవ్వాలి
మూడు ఎకరాల హామీ కింద మరో రూ.30 లక్షలు ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి తేవాలని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ దళితులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేస్తుంటే.. కేసీఆర్ చేతులు వణుకుతున్నాయని, ఆయనకు కనీసం పూలమాల వేయడం కేసీఆర్ కూడా కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. చెక్కులు తీసుకున్న 15 మందికి కూడా పది లక్షలు తీసుకునే స్వేచ్ఛ లేదట, సీఎం నుంచి ఆదేశాలిస్తేనే ఆ డబ్బులు తీసుకోనిస్తామని కలెక్టర్ చెప్పారట అని బొడిగె శోభ విమర్శించారు. పాములాట పెట్టి.. తాయితులు అమ్ముకున్నట్లు.. కేసీఆర్, ఆయన కొడుకు నాటాకాలాడుతున్నారని, పైసలు తీసుకుందాం.. పాములాట చూద్దాం.. కేసీఆర్ పుట్టలో పెట్టేద్దామని ఆమె సూచించారు. 
రాష్ట్ర బడ్జెటే లక్షన్నర కోట్లు.. ఒక్క దళితబంధుకు 2.5లక్షల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారు
రాష్ట్ర ఖజానాలో డబ్బులో లేవంటున్న కేసీఆర్ దళితబంధుకు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ప్రశ్నించారు. 119 నియోజవర్గాల్లోని ఎస్సీలకు దళితబంధు ఇవ్వాలంటే.. 2.5లక్షల కోట్లు అవసరం అవుతాయన్నారు. రాష్ట్ర బడ్జెట్టే లక్షన్నర కోట్లాయే.. దళిత బంధుకు 2.5లక్షల కోట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అందులో మీ కుటుంబ సభ్యులు మెక్కగా... మాకు మిగిలేదెంత ?  ఖజానాలో డబ్బులుంటే భూములు ఎందుకు అమ్ముతున్నాడు? అని బొడిగె శోభ ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత ఉద్యోగులకు దళిత బంధు చివరివిడతలో అంటున్న కేసీఆర్... భూస్వాములైన రైతులకు రైతుబంధు అలాగే ఇస్తున్నారా? అని నిలదీశారు. రైతులకు టింగు, టింగుమని రైతుబంధు పడ్డట్లుగానే... మా దళితులందరికీ కూడా ఒకేసారి టింగ్ టింగ్ మంటూ మెసేజ్ లు వచ్చేలా దళితబంధు డబ్బులు బ్యాంకులో వేయాలని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ డిమాండ్ చేశారు.