గణపతి బప్పా…మోరియా ఎందుకంటారో తెలుసా .... అసలు కథ ఇదే...

గణపతి బప్పా…మోరియా   ఎందుకంటారో  తెలుసా ....   అసలు కథ ఇదే...

మన పండుగలు భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయకచవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. అయితే వినాయక చవితి ఉత్సవాలలో ఎక్కువగా మనకు వినిపించేది గణపతి బప్పామోరియా... ఈ పదానికి వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం…

గణపతి బప్పా మోరియా అనేది వినాయకుని వేడుకల సమయంలో ఉపయోగించే ఒక ప్రసిద్దమైన వాక్యం. భక్తులు వినాయకుడి కొలిచేందుకు... ఆయనకు జేజేలు పలికేందుకు వాడతారు.  ఈ వాక్యం గణేశుని ప్రాముఖ్యతతో పాటు ఆయన ఆశీర్వాదాలను కూడా అందజేస్తుందని భక్తులు నమ్ముతారు.  గణేశుడు ఏనుగు తల దేవుడిగా పరిగణించబడతాడు.  బప్పా అనగా తండ్రి లేదా దేవతకు ఇష్టమైన పదం.  ఇక మోరియా అంటే భక్తి భావాన్ని వ్యక్తపరిచే మార్గమని పండితులు అంటున్నారు.  మోరియా అనేది మరాఠీ పదం.. దీని ప్రకారం మోరియా అనగా గొప్పరాజు.. లేదా గొప్ప నాయకుడిని సంబోధిస్తూ భక్తిని.. గౌరవాన్ని తెలియజేస్తారు. 

ఇక పురాణాల ప్రకారం ....

వినాయకుడు పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం. తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి ప్రత్యేకతలు వినాయకుడిలో చాలా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఇప్పటి మోర్గాం ప్రాంతంలో జరిగిన కథ ఇది. పుణెకు 79 కిలోమీటర్ల దూరంలో బారమతీ తాలూకాలో ఉంది. పూర్వం ఇక్కడి గండిక రాజ్యాన్ని చక్రపాణి అనే రాక్షసరాజు పాలించేవాడు. అతని భార్య ఉగ్ర. పిల్లలు లేనందువల్ల శౌనక మహాముని సూచనమేరకు సూర్యోపాసన చేయగా సూర్యుడి అనుగ్రహం వల్ల రాణి గర్భవతి అయ్యింది.

సూర్యుడి లాంటి వేడితో పిల్లవాడు జన్మించడం వల్ల అతడిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో దొరకడం వల్ల ఆ పిల్లాడిని సముద్ర లేదా సింధురాసురుడు అని పిలిచేవారు. సింధు పెద్దవాడై సూర్యోపాసకుడిగా సుదీర్ఘకాలం తపస్సు చేస్తాడు. తపస్సు ఫలితంగా సూర్యుడు అతనికి అమృతం ప్రసాదిస్తాడు. అది ఉన్నంతకాలం సింధుకు మృత్యుభయం ఉండదు. ఈ ధైర్యంతో సింధు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. దేవతలపై కూడా దాడి చేశాడు. తర్వాత కైలాసం.. వైకుంఠంపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు మేరు పర్వతం వద్ద తలదాచుకున్నారు. మహా విష్ణువును కూడా గండికా రాజ్యంలోనే ఉండాలని సింధురాసురుడు ప్రకటించాడు. దేవ గురువైన బృహస్పతి ఈ పరిస్థితిని పరిశీలించి వినాయకుడిని ప్రార్థిస్తే ఈ గండం నుంచి బయటపడతారని సలహా ఇచ్చాడు. వారి శరణు విన్న వినాయకుడు సాక్షాత్కారమై.. తాను పార్వతీ దేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని అంతమొందిస్తానని వారితో చెప్పాడట.

పన్నెండేండ్లు మేరు పర్వతంపై గణేశుడి మంత్రం జపించారట. అలా భాద్రపద శుద్ధ చతుర్థినాడు గణపతి పార్వతికి కొడుకుగా పుట్టాడట. ఒకసారి సింధురాసురుడి మిత్రుడైన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గణపతి నెమలి వాహనధారియై కమలాసురునితో యుద్ధం చేశాడట. సింధురాసురునిపై బాణమేసి ఉదరం చీల్చాడట. అప్పుడు సింధురాసురుడి ఉదరంలోని అమృతం బయటకొచ్చి అతడు మరణిస్తాడు. దేవతలు ఆనందంతో గణపతిని పూజిస్తారు. అప్పటి నుంచి మోర్గాం గణపతి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతున్నది. ‘మోర్‌’ అంటే నెమలి. యుద్ధానికి నెమలి వాహనమేసుకొని వచ్చి సింధురాసురుడిని హతం చేశాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని మోర్గాం అని.. అక్కడి గణపతి పుణ్యక్షేత్రంలో ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు కొలుస్తుంటారు. అది క్రమంగా అంతటా వ్యాపించి.. ‘గణపతి బప్పా మోరియా’గా ప్రసిద్ధికెక్కింది.

అందుకే గణపతి బప్పా మోరియా అని భక్తులు అంటారు. ఈ కథను చెప్పేవారికి, వినే వారికి, చదువేవారికి శ్రీమోరేశ్వరానుగ్రహం చేత సమస్త కోరికలు ఫలిస్తాయని పండితులు అంటున్నారు. ధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుందని చెబుతున్నారు.