ఈటలపై పోటీ ఎవరు?

ఈటలపై పోటీ ఎవరు?

బీజేపీ నుంచి బరిలో ఈటల
 ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్న టీఆర్‌‌ఎస్‌‌
 తెరపైకి మాజీ ఎంపీ వినోద్‌‌, కెప్టెన్‌‌ లక్ష్మీకాంతారావు భార్య సరోజిని, కాంగ్రెస్‌‌ నేత కౌశిక్‌‌
  కాంగ్రెస్‌‌ నుంచి పోటీకి పొల్నేటి, ప్యాట ప్రయత్నం

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ప్రకటించడంతో 6 నెలల్లో ఎప్పుడైనా ఆ నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్షన్ వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల చూపు హుజూరాబాద్‌‌పై పడింది. కేసీఆర్‌‌కు కుడి భుజంగా ఉన్న ఈటల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌‌ కావడం, వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమై పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడం, ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌‌ఎస్‌‌కు సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజా తీర్పు కోసం సిద్ధమవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపింది. వచ్చే వారం బీజేపీలో చేరనున్న ఈటల.. కమలం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగనున్నారు. 
టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీలకు కీలకం
అటు టీఆర్ఎస్‌‌కు, ఇటు బీజేపీకి ఈ ఎన్నిక కీలకం కానుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ఎన్నిక కలిసి రానుంది. దుబ్బాక గెలుపు, గ్రేటర్‌‌లో మంచి రిజల్ట్‌‌ రావడంతో ఊపు మీదున్న ఆ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నిక కాస్త నిరాశ కలిగించింది. ఇప్పుడు ఈటల లాంటి ఉద్యమకారుడు బీజేపీలో చేరడంతో ఆ పార్టీకి బలం పెరిగింది. బీజేపీ నుంచి ఈటల గెలిస్తే ఆ ప్రభావం 2023 వరకు ఉంటుందని నేతలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌‌ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. 
టీఆర్‌‌ఎస్‌‌ నుంచి ఎవరు?
బీజేపీ నుంచి ఈటల పోటీ ఖాయం కావడంతో ఆయనను ఢీకొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మాజీ ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్‌‌ కుమార్‌‌తో పాటు హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు సతీమణి సరోజినిల పేర్లు టీఆర్ఎస్ తరఫున ప్రచారంలో ఉన్నాయి. కరీంనగర్ ఎంపీగా, హన్మకొండ ఎంపీగా వినోద్ పని చేయడంతో నియోజకవర్గంతో ఆయనకు దగ్గరి సంబంధాలున్నాయి. పైగా ఈటలతో పాటు వినోద్ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌‌తో కలిసి పని చేయడం టీఆర్ఎస్‌‌కు ప్లస్ అవుతుందని హై కమాండ్ భావిస్తోంది. సెగ్మెంట్‌‌పై మొదటి నుంచీ పట్టున్న లక్ష్మీకాంతారావు కుటుంబం నుంచి ఒకరిని బరిలో నిలిపితే ఎలా ఉంటుందని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు  సమాచారం. ఋసరోజిని గతంలో ఎంపీపీగా పని చేశారు. దీంతో ఆమెను బరిలో నిలిపే విషయంపైనా చర్చ నడుస్తోంది. వీళ్లతో పాటు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈటలకు పోటీ ఇచ్చిన పాడి కౌశిక్‌‌రెడ్డిని టీఆర్ఎస్‌‌లోకి తీసుకొని పోటీలో నిలిపితే ఎలా ఉంటుందని కూడా టీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  
కాంగ్రెస్‌‌ నుంచి కౌశిక్‌‌ పోటీ చేయకపోతే..
కాంగ్రెస్ నుంచి కౌశిక్ బరిలో నిలవకపోతే ఆ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై పీసీసీ దృష్టి సారించింది. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌‌గా పని చేసిన పోల్నేని సత్యనారాయణరావు, పీసీసీలో కొనసాగుతున్న ప్యాట రమేశ్ కాంగ్రెస్ తరఫున నిలబడేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. 
హుజూరాబాద్‌‌పై పట్టుకు టీఆర్‌‌ఎస్‌‌ ప్రయత్నం
ఈటలను బర్తరఫ్ చేయగానే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నించింది. ఆ నియోజకవర్గంలో ఈటలకు అనుకూలంగా ఉన్న పోలీసు, రెవెన్యూ, పంచాయతీ తదితర అధికారులందరినీ బదిలీ చేసింది. పార్టీ నుంచి ఎవరూ ఈటల వైపు వెళ్లకుండా కట్టుదిట్టం చేసింది. అదే జిల్లాకు చెందిన బీసీ మంత్రి గంగుల కమలాకర్‌‌ను రంగంలోకి దింపి సర్పంచ్ మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్,  మార్కెట్ కమిటీ  చైర్మన్లు, గ్రామ, మండల, పట్టణ అధ్యక్షులందరూ పార్టీ వీడకుండా కమలాకర్ ద్వారా కేసీఆర్‌‌ కథ నడిపించారు.