హుజూరాబాద్​లో ​కాంగ్రెస్  అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్​లో ​కాంగ్రెస్  అభ్యర్థి ఎవరు?
  • బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కసరత్తు
  • పరిశీలనలో కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణారెడ్డి పేర్లు
  • 14న కార్యవర్గ సమావేశంలో చర్చ.. అభ్యర్థిని ప్రకటించే అవకాశం

హైదరాబాద్, వెలుగు: హుజూరాబాద్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పీసీసీ చీఫ్​గా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక ఇదే కావడంతో ఆయన ఫోకసంతా దీనిపైనే పెట్టారు. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది.. ఏ వర్గం వారిని దింపితే ఏ మేర ప్రభావం ఉంటుందనే దానిపై లెక్కలేసుకుంటున్నారు. ఓ బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ తరఫున బరిలో నిలపాలని పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. 
ఎవరైతే బెటర్?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో కాంగ్రెస్ తరఫున నియోజక వర్గ ఇన్ చార్జి పాడి కౌశిక్ పార్టీ అభ్యర్థి అని అంతా అనుకుంటూ వచ్చారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్​లో చేరటంతో సీన్ మారింది. ఆ తర్వాత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​పేరు తెర మీదకు రాగా ఆయన పోటీకి నిరాకరించారు. గతంలో సిరిసిల్ల నుంచి పోటీ చేసిన కె.కె.మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజక వర్గంలో కొంత పేరున్న స్వర్గం రవి పేర్లు తెర మీదకు వచ్చాయి. మహేందర్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపనట్లు తెలిసింది. స్వర్గం రవి ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్​కు షాక్​ఇచ్చారు. కవ్వంపల్లి జిల్లా అధ్యక్షుడైనా హుజూరాబాద్​లో ఆయనకు పట్టు లేదనే వాదన వినిపిస్తోంది. స్థానిక నేత పత్తి కృష్ణారెడ్డికి జనంలో పెద్ద అభిమానం లేకపోయినా లోకల్ అభ్యర్థి అవుతాడనే ఆలోచన పార్టీలో ఉంది. అయితే అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దళిత బంధు పథకాన్ని ఈ ఎన్నికల కోసమే తెచ్చామని, అందులో తప్పేముందని సీఎం కేసీఆర్ బహిరంగంగానే సమర్థించుకున్నారు. బుధవారం టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ను అభ్యర్థిగా ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల బీజేపీ అభ్యర్థిగా ఎప్పుడో ప్రచారం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి రాజీనామా చేసి రంగంలోకి దిగిన ఆయన పట్ల ప్రజల్లో మంచి సానుభూతే కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్​ తన ఉనికిని చాటుకోవడం అనివార్యమైంది. రేవంత్​వర్గానికైతే ఇదో సవాల్​గా మారింది. హుజూరాబాద్​ఎన్నికలు తమకో లెక్క కాదని రేవంత్ ఈ మధ్యే మీడియాతో అన్నారు. ఎంతో కొంత అక్కడ సత్తా చూపాలని పార్టీ నేతలతో అంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన చాలా రోజుల నుంచి కొండా సురేఖను బరిలో దిగమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్​ను ఆనుకునే ఆమె నియోజక వర్గం (పరకాల) ఉంది. కుల సమీకరణలు కూడా సరిపోతాయని రేవంత్​భావిస్తున్నారు. కొండా దంపతులిద్దరు వేర్వేరు కులాలైనా ఇద్దరు బీసీలే.. టీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ పడుతున్నది కూడా బీసీలే.. కనుక కొండా సురేఖ అభ్యర్థిత్వం సరైందని పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
14న ప్రకటించే చాన్స్..
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ప్రతి వారం శనివారం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించి, దాన్ని అమలు చేస్తున్నారు. ఈ శనివారం (ఆగస్టు14)  జరిగే సమావేశంలో హుజూరాబాద్ అభ్యర్థి అంశాన్ని చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు గాంధీభవన్ వర్గాల సమాచారం. హుజూరాబాద్ ఎన్నికల ఇన్ చార్జిగా ఉన్న పార్టీ సీనియర్​ నేత, మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఇప్పటికే అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం జరిగే సమావేశంలో దీనిపై చర్చించి, ఢిల్లీకి అభిప్రాయాన్ని పంపి అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు.