
- కొడుకును వినాయక మండపం వద్ద నిద్రకు పంపి మర్డర్
- నిద్రలో ఉండగా గొంతు నులిమి, డంబెల్‌తో కొట్టి హత్య
- దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. నిద్రలో ఉండగా గొంతు నులిమి.. డంబెల్‌తో కొట్టి హత్య చేసింది. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాధవరం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్, రంగారెడ్డి జిల్లా వెలిదండ మండలం కుప్పగండ్లకు చెందిన చిట్టితో 2009లో పెండ్లి అయ్యింది. వృత్తి రీత్యా కారు డ్రైవర్ అయిన శేఖర్.. కొన్నేండ్ల కింద కుటుంబంతో సహా దిల్సుఖ్ నగర్ కోదండరాంనగర్ లోని రోడ్ నంబర్ 7లో నివాసం ఉంటున్నాడు.
వీరికి 15 ఏండ్ల కుమార్తె, 13 ఏండ్ల కొడుకు ఉన్నారు. భార్య చిట్టి దిల్ సుఖ్ నగర్‌లోని ఓ బట్టల షాపులో పని చేస్తుంది. ఈ క్రమంలోనే హరీశ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. శేఖర్ డ్రైవింగ్‌పై వేరే నగరాలకు వెళ్లినప్పుడల్లా చిట్టి, హరీశ్ కలుసుకునేవాళ్లు. ఈ విషయం శేఖర్‌కు తెలవడంతో పలుమార్లు చిట్టిని మందలించాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని చిట్టి డిసైడ్ అయింది. ప్లాన్ ప్రకారం.. గురువారం రాత్రి కొడుకు వినాయక మండపం వద్ద నిద్రకు పంపింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రియుడు హరీశ్‌ను ఇంటికి పిలిచింది. నిద్రలో ఉన్న శేఖర్ (40)ను ఇద్దరూ కలిసి గొంతు నులిమి.. డంబెల్‌తో కొట్టి హత్య చేశారు.
నేచురల్ డెత్‌గా చిత్రీకరించేందుకు రక్తపు మరకలన్నీ తుడిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి.. తన భర్త నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న సరూర్‌నగర్ పోలీసులు భార్యపై అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. తన ప్రియుడు హరీశ్‌తో కలిసి శేఖర్‌ను చంపేసినట్లు చిట్టి ఒప్పుకున్నది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రియుడు హరీశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని సీఐ సైదిరెడ్డి తెలిపారు.