30న సౌత్ కొరియాలో జిన్పింగ్, ట్రంప్ మీటింగ్

30న సౌత్ కొరియాలో  జిన్పింగ్, ట్రంప్ మీటింగ్

బీజింగ్: దక్షిణ కొరియాలో ఈ నెల 30న జరిగే ఏపీఈసీ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్ హాజరు కానున్నారు. ఇదే సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌తో జిన్​పింగ్​ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ఈ మీటింగ్​తో తగ్గే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ఆహ్వానం మేరకు జిన్‌‌పింగ్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 మధ్య ఆ దేశంలో పర్యటించనున్నారు.

 ఈ సందర్భంగా గ్యాంగ్‌‌జులో జరిగే 32వ ఏపీఈసీ సమావేశంలో పాల్గొంటారు. అక్టోబర్ 30న బుసాన్‌‌లో జిన్‌‌పింగ్, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగనుంది. ఇది ట్రంప్ రెండో సారి పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే అత్యంత ముఖ్యమైన అమెరికా-– చైనా శిఖరాగ్ర సమావేశంగా భావిస్తున్నారు. చైనా రేర్​ మెటల్స్​ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు, అదనపు టారీఫ్​లు, మరికొన్ని నియంత్రణ చర్యల నేపథ్యంలో వాణిజ్యపరంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సమావేశంలో అన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుందని ఎనలిస్టులు భావిస్తున్నారు.