రాహుల్ పీఎం అవ్వాలని అప్పట్లో వైఎస్సార్ చెప్పారు

 రాహుల్ పీఎం అవ్వాలని అప్పట్లో వైఎస్సార్ చెప్పారు

 

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజనికుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ జోహార్.. అమర్ హై అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షేమ పధంలో నడిపింది వైఎస్సార్ అని గుర్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు.. పేదలకు అండగా ఆరోగ్య శ్రీ నిలిచిందన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకోవడానికి అప్పులు చేస్తున్నాయని విమర్శించారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అప్పు నాలుగున్నర లక్షల కోట్లు దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధి దేశానికి ప్రధాని కావాలని అప్పట్లో వైఎస్సార్ చెప్పారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.