ఇవాల్టితో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర వందో రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ముగించుకొని సూర్యాపేట జిల్లాలో అడుగుపెట్టనున్నారు షర్మిల. కోదాడ నియోజకవర్గంలో 100వ రోజు పాదయాత్ర కొనసాగించనున్నారు. సూర్యాపేట జిల్లాలో అడుగుపెడుతున్న సందర్భంగా కోదాడలో షర్మిలకు కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. బొజగూడెం, తామరబండ పాలెం మీదుగా షర్మిల పాదయాత్ర జరగనుంది.
2021 అక్టోబర్ 21న వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగే తానూ కూడా సెంటిమెంట్‌గా భావించి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు.21 రోజుల తరువాత ఎన్నికల నిబంధనలు, కోవిడ్ రావడంతో బ్రేక్ పడగా, మార్చి 18 నుంచి ఈ యాత్రను మళ్లీ మొదలుపెట్టారు. చేవెళ్ల నుంచి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు, ముఖ్య ప్రాంతాల్ని చుట్టేలా పాదయాత్ర చేసేందుకు పార్టీ వర్గాలు ప్లాన్ చేశాయి.
సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఊరు..వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దాదాపు 1300 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ... ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం సమస్యల పరిష్కరానికి మార్గం చూపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే తెలంగాణను ఎలా అభివృద్ది చేస్తాననే విషయంపై పాదయాత్రలో వివరిస్తున్నారు. 4,000 కిలోమీటర్ల పాదయాత్ర లో 90 నియోజక వర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు నియోజకవర్గాలు మాత్రమే జనరల్. వాటిల్లో కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం ఉన్నాయి. కొత్తగూడెంలో బీసీలకు.. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి, పాలేరులో రెడ్డి సామాజికవర్గానికి పార్టీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. పాలేరు సెగ్మెంట్ ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు సరిహద్దుల్లో ఉంటుంది.
ఇక్కడ ఎక్కువసార్లు గెలిచిన పార్టీ కాంగ్రెస్సే. మూడుసార్లు వామపక్షాలు పాగా వేయగా.. ఒకసారి బైఎలక్షన్లో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు అక్కడ బలమైన నాయకత్వం లేదన్న వాదన ఉంది. అలాగే YS రాజశేఖర్రెడ్డికి అభిమానులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా లెక్కలేస్తున్నారట. ఆ కారణంగానే YSR కూతురిగా.. షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
