తిరుమల చిరుత దాడిలో ట్విస్ట్ : తల్లిదండ్రులపై వైసీపీ ఎమ్మెల్యే అనుమానాలు

తిరుమల చిరుత దాడిలో ట్విస్ట్ : తల్లిదండ్రులపై వైసీపీ ఎమ్మెల్యే అనుమానాలు

తిరుమల అలిపిరి నడకదారిలో చిరుత ఆరేళ్ల పాపపై దాడి చేసి చంపిన ఘటన కలకలంరేపింది. అయితే ఈ కేసులో లక్షిత తల్లిదండ్రులపై తనకు అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే  ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినట్లు బాలిక తండ్రి దినేష్ చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది కాలినడక దారిలో వెళ్లే భక్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు.
 

తిరుమలలో ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి చంపిన ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఘటనపై స్పందించిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. తాను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డితో మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని ఈవో, ఛైర్మన్ తనతో చెప్పారన్నారు. అయితే ఈ ఘటనలో తల్లిదండ్రులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకో తల్లిదండ్రులపై అనుమానం ఉందన్నారు. పోలీసులు వారిని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ విషయం కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు.