రేపట్నుంచి షర్మిల  పాదయాత్ర

రేపట్నుంచి షర్మిల  పాదయాత్ర
  • 14 నెలలు, 400 రోజులు , 4,000 కిలోమీటర్లు
  • 90 అసెంబ్లీ, 14 ఎంపీ సెగ్మెంట్ల మీదుగా యాత్ర
  • నేడు ఇడుపులపాయలో  వైఎస్ఆర్ సమాధికి నివాళులు

హైదరాబాద్, వెలుగు: వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర బుధవారం నుంచి మొదలు కానుంది. చేవెళ్ల నుంచి 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల పొడవున యాత్ర సాగనుంది. మంగళవారం కడప జిల్లా ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ సమాధికి షర్మిల నివాళులు అర్పిస్తారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకొని బుధవారం నుంచి యాత్ర స్టార్ట్ చేస్తారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ, 14 లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో 14 నెలలు పాదయాత్ర జరుగుతుందని పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. 
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల సమస్యలు, ఆకాంక్షలు, వివిధ వర్గాల వారి ఆశలు, ఆశయాలు నెరవేరాయో లేదో ప్రత్యక్షంగా తెలుసుకోవడమే షర్మిల యాత్ర లక్ష్యమని వివరించారు. ‘‘బుధవారం చేవెళ్లలో బహిరంగసభలో పాల్గొన్నాక షర్మిల యాత్ర స్టార్ట్ చేస్తారు. రోజూ ఉదయం 8.30 నుంచి 12.30 దాకా, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల దాకా 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. యాత్ర చేవెళ్లలో మొదలై రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లలో 9 రోజులు సాగాక దేవరకొండ వద్ద  నల్గొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ జిల్లాలో 20 రోజులుంటుంది. ప్రతి మంగళవారం సాగిన నిరుద్యోగ దీక్ష యాత్రలోనూ కొనసాగుతుంది. తెలంగాణ సాధించుకున్న త‌‌‌‌ర్వాత ప్రజ‌‌‌‌లు బాగుప‌‌‌‌డిందేమీ లేదు. కొంద‌‌‌‌రు మాత్రమే సంపాదించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌‌‌‌కాలని యువ‌‌‌‌త‌‌‌‌లో సెంటిమెంటు రెచ్చగొట్టారు. ఇప్పుడు ఉద్యోగాలివ్వక‌‌‌‌పోగా ఉన్నవి తొల‌‌‌‌గిస్తున్నారు. నీళ్ల ఊసే లేదు. ఎన్నిక‌‌‌‌లప్పుడు సెంటిమెంటును పదేపదే వాడుకుంటూ అధికారాన్ని కొంద‌‌‌‌రే అనుభ‌‌‌‌విస్తున్నారు” అని విమర్శించారు.