- కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు విమర్శ
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ముందు హరీశ్ రావు తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకోసమే సీఎం రేవంత్‌పై విష ప్రచారం చేస్తున్నారని వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
హరీశ్ నీతి, జాతి ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసని మండిపడ్డారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలు అందరికి తెలుసని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి కేసీఆర్ కు దొరికిపోయిన సంగతిని హరీశ్ గుర్తుంచుకోవాలన్నారు.
అందుకే ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆరోపించారు. హరీశ్ చేసిన ఘనకార్యాలను కవిత బయటపెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే నాగరాజు గుర్తు చేశారు. రబ్బరు చెప్పులు, ట్రంకు పెట్టెతో హైదరాబాద్ కు వచ్చిన హరీశ్‌కు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు, బినామీ పేర్లతో భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ముందు, ఆ తర్వాత హరీశ్ రావు తన ఆస్తులు ఏమిటో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
