
కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న.. తెలంగాణకు రావాల్సిన నీళ్లను వదులుకోం
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు
కేసీఆర్ ముక్కు నేలకు రాస్తే చేసిన పాపం పోతదా?
ఉప ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యోగాలు, పెన్షన్లు గుర్తొస్తయా?
వైఎస్‌ను ఎవరేమన్నా ఊరుకోం
వంద రోజుల తర్వాత పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఏం చేశారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. గోదావరిపై ప్రాణహిత నుంచి పోలవరం వరకు, కృష్ణా నదిపై జూరాల నుంచి పులిచింతల దాకా తెలంగాణకు రావాల్సిన నీటిని వదులుకోబోమని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలకు దక్కాల్సిన నీళ్లు వారికి వెళ్లాల్సిందేనని, సమన్యాయం జరగాలని అన్నారు. ‘‘రెండు నిమిషాలు ఇద్దరు సీఎంలు కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవచ్చు కదా.. ఇద్దరు కలిసి లంచ్ చేస్తరు. స్వీట్లు తినిపించుకుంటరు. ఇద్దరు కలిసి వారి ప్రత్యర్థిని ఓడిస్తరు’’ అని చెప్పారు. నీళ్ల వివాదాలను పరిష్కారించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం కోసం, రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెడుతున్నానని వైఎస్ షర్మిల అన్నారు. ‘‘వైఎస్ఆర్ జయంతి అంటే మనందరికి పండుగ రోజు. అందుకే అదే రోజున పార్టీ పెడుతున్నా. ఐదేళ్ల తన పాలనలో 11 లక్షల ఉద్యోగాలను వైఎస్ భర్తీ చేశారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు’’ అని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమం అధ్వానంగా ఉందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినా, అప్పులు తెచ్చినా పేదరికం మాత్రం పోలేదన్నారు. ఉప ఎన్నికలు వచ్చినపుడే కేసీఆర్ కు ఉద్యోగాలు, రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు గుర్తొస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ మాటలన్నీ బూటకమని.. గారడి మాటలు, చేతికి చిప్పలు అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల ప్రకటించారు. పాలపిట్ట, తెలంగాణ మ్యాపు, వైఎస్ఆర్ ఫొటో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్టేజ్ పై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి, వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఇందిరా శోభన్ రచించిన ‘రాజన్న అడుగు జాడల్లో’ బుక్ ను ఆమె విడుదల చేశారు. తర్వాత షర్మిల మాట్లాడారు.
తల ఎప్పుడు నరుక్కుంటరు
కరోనాకు చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని తాము ఎంత డిమాండ్ చేసినా చేర్చలేదని షర్మిల మండిపడ్డారు. ప్రజలు అప్పులపాలై, ఆస్తులు అమ్ముకున్నారని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాస్తే చేసిన పాపం పోతుందా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలను సీఎం కేసీఆర్ నిత్యం అవమానిస్తున్నారని అన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఓటు బ్యాంకుగా వాళ్లను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. నేరెళ్లలో దళితులపై దాడులు జరిగాయని, మొన్న మరియమ్మ ఘటన కూడా కేసీఆర్ వల్లే జరిగిందన్నారు. బీసీలకు గుర్తింపు లేదని, బీసీ రిజర్వేషన్లను తగ్గించారని ఆరోపించారు. దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని అన్నారని, ఎప్పుడు నరుక్కుంటారని ప్రశ్నించారు. ఉద్యమంలో 1,200 మంది చనిపోతే 400 మంది కుటుంబాలనే ఆదుకున్నారని, వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించాలన్నారు.
వైఎస్ పేరు పలికే అర్హత కాంగ్రెస్‌కు లేదు..
రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందంటే అది వైఎస్ వల్లేనని షర్మిల అన్నారు. వైఎస్ ను టీఆర్ఎస్ నేతలు తిడుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. ఇప్పుడేమో వైఎస్ వారసులమని చెప్పుకుంటున్నారన్నారు. వైఎస్ పేరు పలికే అర్హత కాంగ్రెస్ కు లేదని, ఎప్పటికైనా వైఎస్ వారసులు తామేనని తేల్చిచెప్పారు.
కేసీఆర్ అవినీతిపై కేంద్రం ఏం చేస్తోంది..
‘‘కేసీఆర్ అవినీతిపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, త్వరలో జైలుకు పంపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదు? అరెస్టులు ఎందుకు జరగట్లేదు’’ అని నిలదీశారు. ఇద్దరి మధ్య డీల్ ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్, బండి సంజయ్ తోడు దొంగలని ఆరోపించారు. వంద రోజుల తర్వాత పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు. వైఎస్ ను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా అంటే ఊరుకోబోమని, ఆయన ఫ్యాన్స్ ఉరికించి కొడతారని హెచ్చరించారు.
దోచుకోవటం తెలియదు..: విజయమ్మ
వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లు వైఎస్ కాంగ్రెస్ లో ఉండి పార్టీని బలోపేతం చేసి, రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ప్రేమ ఉంటే వైఎస్‌ను దోషిగా ఎందుకు చూపించారని ప్రశ్నించారు. మమ్మల్ని రోడ్డు పైన పడేసిన మీరు.. ఈ రోజు వైఎస్సార్ ని భుజాలపై ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలు మనవేనని, ఇక్కడ నీళ్లతోపాటు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించటానికి బోర్డులు, కేంద్రం ఉన్నాయన్నారు. రాజశేఖర్ రెడ్డి పిల్లలు దొంగలు, గజ దొంగలు కానే కాదన్నారు. దాచుకోవటం, దోచుకోవటం తమకు తెలియదన్నారు.