కొడుకుతో స్పెషల్ ఇన్నింగ్స్ చూస్తే సెలబ్రేట్ చేసుకున్న యువీ

కొడుకుతో స్పెషల్ ఇన్నింగ్స్ చూస్తే సెలబ్రేట్ చేసుకున్న యువీ

2007 వరల్డ్కప్ గుర్తుందా..ఎలా మర్చిపోగలం అంటారా..! అవును. మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్లో భారత్కు మరుపురాని జ్ఞాపకాలు ఎన్నో. ఆడిన తొలి వరల్డ్ కప్లో టీమిండియానే విజేతగా నిలవడం ఎలా మర్చిపోగలం. దీని కంటే ముఖ్యంగా..ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్పై విజయం చిరస్మరణీయం. 

2007 టీ20 వరల్డ్ కప్ అంటే గుర్తుకొచ్చేది యువరాజ్ సింగ్ విధ్వంసమే. ఇంగ్లాండ్పై అతను కొట్టిన ఆరు సిక్స్ల ఇన్నింగ్స్ అభిమానుల మదిలో ఎప్పటికీ మెదులుతూనే ఉంటుంది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువీ బాదిన ఆరు సిక్సుల ఇన్నింగ్స్కు సరిగ్గా నేటితో 15 ఏళ్లు.  ఈ సందర్భంగా యువీ విధ్వంసాన్ని మరోసారి విశ్లేషించుకుందాం...

బ్రాడ్ బొమ్మలా మారిన వేళ...
సెప్టెంబర్ 19, 2007న డర్బన్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ ఇండియా  మ్యాచ్లో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది. సెమీఫైనల్కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో టీమిండియా 18 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లకు 171 పరుగులు చేసింది. 19వ ఓవర్ ను వేసేందుకు స్టువర్డ్ బ్రాడ్ వచ్చాడు. అతని బౌలింగ్ లో యువరాజ్ వీరలెవల్లో రెచ్చిపోయాడు. వరుసగా ఆరు సిక్సులు బాదాడు. యువీ కొడుతుంటే..బ్రాడ్ బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు. పిచ్ పై ఎక్కడేసినా..బంతి మాత్రం స్టాండ్ లోకే వెళ్తుంది. యువీ బాదుడికి..బ్రాడ్ మైండ్ బ్లాక్ అయింది. మొత్తంగా 12 బంతుల్లోనే అర్థశతకం బాది చరిత్ర సృష్టించాడు. 

ఫ్లింటాప్తో గొడవ..
యువీ ఆరు సిక్సుల విధ్వంసానికి కారణంగా.. అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్. యువీ బ్యాటింగ్ చేస్తుండగా...అతని దగ్గరికి వచ్చిన ఫ్లింటాఫ్.. ఏదో అంటూ బౌండరీ లైన్ దగ్గరికి వెళ్లాడు...ఆ తర్వాత యువరాజ్ సింగ్ రెచ్చిపోయాడు. బ్రాడ్ వేసిన 19వ ఓవర్లో వరుసగా ఆరు సిక్సులు కొట్టాడు. ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

యువీని ఫ్లింటాఫ్ ఏమన్నాడు..?
యువీని ఆండ్రూ ఫ్లింటాఫ్ మధ్య గొడవకు కారణమేంటో..యువరాజ్ బయటపెట్టాడు. ఈ ఓవర్ కంటే ముందు ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టానని యువీ చెప్పాడు. ఆ షాట్స్‌తో ఫ్లింటాఫ్ తీవ్ర అసహనానికి గురై..చివరి బంతి తర్వాత సెడ్జింగ్ చేశాడని... చెత్త షాట్స్ ఆడావంటూ హేళన చేయడంతో..తనకు కోపం వచ్చిందని యువీ వెల్లడించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైందన్నాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ తనపై కోప్పడుతూ.. గొంతు కోస్తానంటూ బెదిరించాడని..తాను బ్యాటుని చూపించి, కొడతానని సమాధానం ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను  బ్రాడ్ బౌలింగ్‌ లో  సిక్సుల వర్షం కురిపించానని వివరించాడు. 

కొడుకుతో స్పెషల్ ఇన్నింగ్స్ చూస్తూ...
యువీ విధ్వంసానికి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశాడు. తన కొడుకు ఓరియన్ కీచ్ సింగ్‌తో ఆ మ్యాచ్ వీడియో చూస్తున్న వీడియోను షేర్ చేశాడు. 15 ఏళ్ల తర్వాత ఈ ఇన్నింగ్స్‌ని చూసేందుకు ఇంతకంటే బెటర్ పార్టనర్‌ ఎవరు దొరుకుతారు..’ అంటూ కామెంట్ చేశాడు. 

యువీ కెరీర్..
2007లో స్కాంట్లాండ్తో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్..తన కెరీర్లో 58 టీ20లు ఆడాడు. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే బౌలింగ్లో 28 వికెట్లు కూడా పడగొట్టాడు.