వేములవాడలో ‘పార్కింగ్’ దోపిడీ

వేములవాడలో ‘పార్కింగ్’ దోపిడీ
  • రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న ఈవో
  • నాలుగు టెండర్లు క్యాన్సిల్​

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం పలు విభాగాల్లో ఈఓ రమాదేవి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నాలుగు టెండర్లను రద్దు చేశారు. కొద్దిరోజులుగా ఆలయానికి సంబధించిన టీటీడీ వెహికల్​ పార్కింగ్ ప్రదేశంలో భక్తుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఈవో దృష్టికి వచ్చింది. గురువారం సాధారణ భక్తుల్లా ఈవో కారులో తనిఖీకి వెళ్లారు. రూల్​ ప్రకారం బైక్​లకు రూ. 20, త్రీ వీలర్​కు రూ. 30, ఫోర్ ​వీలర్స్​కు రూ. 50, ఇతర వెహికల్స్​కు రూ. 100 వసూలు చేయాలి. ఈవో ఉన్న కారుకు టెండర్ దారుడు రూ. 80 వసూలు చేశాడు. ఆలయ టెండర్ ప్రకారం దేవస్థానం ఇచ్చిన పార్కింగ్ ధరల బుక్స్ కాకుండా నిర్వాహకులు అధిక రేట్లు ముద్రించిన బుక్స్ తో భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఈవో గుర్తించారు. అలాగే కొబ్బరి ముక్కలు పోగు చేసుకొనే టెండరుదారుడు అక్రమంగా భక్తుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో రెండు టెండర్లు రద్దు చేశారు. దీంతోపాటు పాత ఎంక్వైరీ ఆఫీసు క్యాంటీన్ లీజుదారుడు టెండరు రూల్స్​కు వ్యతిరేకంగా అక్రమంగా సబ్ లీజుకు ఇచ్చినందుకు  టెండరు రద్దు చేశారు. రాజన్న టెంపుల్​అనుబంధ ఆలయమైన నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఘాట్​రోడ్డు టోల్ గేట్ టెండరుదారుడు భక్తుల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు విచారణ చేసి టెండరు రద్దు చేశారు. మళ్లీ టెండర్​ నిర్వహించే వరకు వెహికల్​పార్కింగ్​కు ఎవరూ డబ్బులు వసూలు చేయరాదని ప్రకటించారు. అలాగే నాంపల్లి గుట్టపైకి వెళ్లే ఘాట్​రోడ్​వద్ద భక్తులకు ఫ్రీ టోల్ గేట్​గా ప్రకటించారు.