హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రూ. 1,090 కోట్ల వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, మరో ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శుక్రవారం ముగ్దా జంక్షన్ వద్ద భూమి పూజ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ రత్నాకర్ సహదేవ్ ఆధ్వర్యంలో అధికారులు ఈ పనులను లాంఛనంగా ప్రారంభించారు.
మొత్తం ఆరు ప్రధాన రద్దీ జంక్షన్ల మీదుగా సాగే ఈ ప్రాజెక్టును రెండు విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు శనివారం నుంచి మరింత ముమ్మరం కానుండటంతో కేబీఆర్ పార్కు చుట్టూ ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను చూసుకోవాలని అధికారులు సూచించారు.
రెండు దశల్లో పనులు ఇలా..
మొదటి దశలో రూ. 580 కోట్ల వ్యయంతో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ‘వై’ ఆకృతిలో రోడ్ నం. 45 నుంచి యూసఫ్‌గూడ వరకు గ్రేడ్ సెపరేటర్, కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి రోడ్ నెం. 36 వైపు నాలుగు వరుసల స్టీల్ ఫ్లైఓవర్, యూసఫ్‌గూడ నుంచి రోడ్ నెం. 45 వైపు రెండు వరుసల ఫ్లైఓవర్‌తో పాటు పంజాగుట్ట, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ల వైపు వెళ్లేందుకు పలు అండర్ పాస్ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఇక రెండో దశలో రూ. 510 కోట్ల వ్యయంతో ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్ల కేంద్రంగా పనులు చేపట్టనున్నారు. ఈ రెండు దశల నిర్మాణాలు పూర్తయితే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చుట్టూ ఉన్న ఆరు ప్రధాన జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి వచ్చి, నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతం ట్రాఫిక్ రహితంగా మారనుంది.
