అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు : సీఎం రేవంత్​రెడ్డి

అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు :   సీఎం రేవంత్​రెడ్డి
  • అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి
  • ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దు
  • లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలపై ఐదు ఉమ్మడి జిల్లాల నేతలతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫండ్స్ కేటాయిస్తామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రకటించారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలకు ఆయన సూచించారు. లోక్​సభ ఎన్నికలపై ఉమ్మడి జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్న రేవంత్.. మంగళవారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో సమావేశమయ్యారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని వారికి సూచించారు. 

త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమిస్తామని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని చెప్పారు.‘‘నియోజకవర్గాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలి. అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దు. ప్రతీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్‌‌‌‌మెంట్ నిధులు కేటాయిస్తున్నాం. ఉమ్మడి జిల్లాల ఇన్​చార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నాం. ఇన్​చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి. 

సమస్యలను పరిష్కరించుకోవాలి. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలి. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి’’ అని రేవంత్ సూచించారు. కాగా, నియోజకవర్గాల్లో అవసరమైన పనులకు రిక్వెస్ట్ పెట్టుకుంటే స్పెషల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ను ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ మంత్రులు రిలీజ్ చేయనున్నారు. వచ్చే మూడు నెలల్లో ఈ నిధులను ఉపయోగించుకునేలా సర్కారు వీలు కల్పించింది.