
- ఉష్ణోగ్రతలు పెరగడంతో సర్కారు నిర్ణయం
శ్రీనగర్: కాశ్మీర్ లోయలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అధికారులు అక్కడి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 8 నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు అన్ని పాఠశాలలకు 10 రోజులు సెలవులు ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు.
కాశ్మీర్ డివిజన్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు వేసవి సెలవులు పాటించాలని, అవసరమైతే విద్యార్థులకు ఆన్‌లైన్ మోడ్లో తరగతులు బోధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వేసవిలో కాశ్మీర్ లోయలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.