- హైదరాబాద్ నుంచి 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
- విజయవాడకు 70 నిమిషాలు, ముంబైకి 2.20 గంటల్లోనే
- ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ 30 లక్షల కోట్లకు చేరిందని వెల్లడి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి హెచ్‌ఐసీసీ పారిశ్రామికవేత్తలతో భేటీ
హైదరాబాద్, వెలుగు: సెమీ కండక్టర్ రంగంలో రాబోయే రోజుల్లో 10 లక్షల మంది ఉద్యోగుల అవ సరం ఉందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి స్టూడెంట్టు రెడీగా ఉండాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. తెలంగాణ నుంచి ఇప్పటికే ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలోనే మరిన్ని రైళ్లతో పాటు కొత్తగా వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోందన్నారు. ‘ఐటీ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది. సెమీకండక్టర్ రంగానికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలోని 350 యూనివర్సిటీల్లో విద్యార్థులు సెమీకండక్టర్ల అభివృద్ధిపై పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ రంగంలో 10 లక్షల ఉద్యోగుల లోటుంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంది. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటికే 104 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు పనిచేస్తుండటం గర్వకారణం’ అని అన్నారు.
రైల్వే బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం ఏడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రకటిస్తే, అందులో తెలంగాణకే మూడు దక్కాయని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది ముంబై–పుణే మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభమవుతుందనీ, ఆ తర్వాత తెలంగాణ హబ్‌గా మారుతుందని చెప్పారు. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 1 గంట 10 నిమిషాల్లో, ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో, చెన్నైకి 2 గంటల్లోనే చేరొచ్చనీ, ఈ క్రెడిట్ అంతా ప్రధాని మోదీ విజన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించిందని వైష్ణవ్ అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్నామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణకు పెద్దపీట: కిషన్ రెడ్డి
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణ రవాణా రంగానికి పెద్దపీట వేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.1.75 లక్షల కోట్లు, బుల్లెట్ రైళ్ల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో రీ-డెవలప్ చేస్తున్నామని, హైటెక్ సిటీ స్టేషన్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు.
బెంగళూరు, పుణే, నోయిడా తరహాలో తెలంగాణలోని టైర్-2 సిటీల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం భారత్ విదేశీ టెక్నాలజీని వాడుకోవడమే కాకుండా, కొత్త టెక్నాలజీని సృష్టించే స్థాయికి ఎదిగిందని.. హైదరాబాద్‌లోనే రాకెట్ ఇంజిన్లు తయారవుతుండటం ఇందుకు నిదర్శనమన్నారు.
