8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్

8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్
  • రాష్ట్రంలోనూ ఈడబ్ల్యూఎస్​ కోటా
  • 8 లక్షల లోపు ఆదాయం ఉన్న ఓసీలకు 
  • విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్
  • ఈడబ్ల్యూఎస్​ వాళ్లకు సర్కారు కొలువుల్లో 
  • గరిష్ట వయోపరిమితి ఐదేండ్లు సడలింపు ఆమోదించిన కేబినెట్​

హైదరాబాద్‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్‌ (ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌) రిజర్వేషన్​ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో ఆమోదముద్ర వేసింది. రూ. 8 లక్షలలోపు ఆదాయం ఉన్న ఓసీలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్‌  వర్తించనుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలోని వారికి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాల్లో గరిష్ట వయోపరిమితిలో ఐదేండ్లు సడలింపును ఇస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రస్తుతం 50 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్‌ వర్తింపజేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాతో అదనంగా మరో పది శాతం రిజర్వేషన్‌ అందుబాటులోకి రానుంది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతానికి చేరనుండగా.. జనరల్‌ కోటా 40 శాతంగా ఉండనుంది. 

రాష్ట్రంలోనూ ఈడబ్ల్యూఎస్​ కోటా

రాష్ట్ర జనాభాలో 9 నుంచి 10 శాతం వరకు ఓసీలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీరిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారు విద్య, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్‌‌ ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌‌, ఐఐటీల్లో ఈ రిజర్వేషన్‌‌ అమలు చేస్తున్నారు. ఇకపై ఎంసెట్‌‌, ఐసెట్‌‌తో పాటు ఇతర సెట్లలో అర్హత సాధించే అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్‌‌ వర్తించనుంది. ప్రభుత్వం భర్తీ చేస్తామంటున్న 50 వేల ఉద్యోగాల్లోనూ ఈ కోటా అమలు చేయనున్నారు. ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి కూడా తాము చేపట్టే నియామకాల్లో ఈ కోటాను అమలు చేయాలని ఇటీవల జరిగిన బోర్డ్‌‌ ఆఫ్‌‌ డైరెక్టర్స్‌‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రభుత్వరంగ సంస్థల్లోనూ ఈ రిజర్వేషన్‌‌ అందుబాటులో  రానుంది.