V6 News

శవాల కింది నుంచి తీసి..తమ్ముడిని కాపాడుకున్నడు

శవాల కింది నుంచి తీసి..తమ్ముడిని కాపాడుకున్నడు

బాలసోర్: బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్​లో తీవ్రంగా గాయపడి ఏడు డెడ్ బాడీల కింద కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పదేండ్ల బాలుడిని అతడి అన్నయ్య రక్షించుకున్నాడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాలుడు చనిపోయాడనుకొని రెస్క్యూ వర్కర్లు శవాల మధ్య పడేశారు. శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ జరగ్గా.. శనివారం తమ్ముడి ఆచూకీ గుర్తించి హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. బాలాసోర్‌‌‌‌లోని భోగరాయ్‌‌‌‌కి చెందిన పదేండ్ల దేబశిష్ పాత్రా పేరెంట్స్, అన్నయ్యతో కలిసి కోరమండల్ ఎక్స్​ప్రెస్​లో ఒడిశాలోని భద్రక్​లో ఉంటున్న మామయ్య వాళ్ల ఇంటికి బయలుదేరాడు.

బాలాసోర్ స్టేషన్ దాటిన కొద్దిసేపటికే గూడ్స్ రైలును ఢీకొట్టడంతో బోగీలు పట్టాలు తప్పాయి. దేబశిష్ నుదురు, ముఖం మీద తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయాడు. సహాయక చర్యలు చేపట్టిన వారు దేబశిష్ చనిపోయాడనుకుని మూటగట్టి శవాల మధ్య పడేశారు. పదో తరగతి చదువుతోన్న దేబశిష్ అన్నయ్య.. తన తమ్ముడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాడు. మరుసటి రోజు 7 డెడ్​బాడీల కింద తమ్ముడిని గుర్తించాడు. అప్పటికీ అతడు ప్రాణాలతోనే ఉన్నాడని తెలుసుకుని వెంటనే కటక్​లోని ఎస్​సీబీ మెడికల్ కాలేజ్ అండ్​ హాస్పిటల్‌‌‌‌కు తరలించాడు.

ట్రీట్​మెంట్ అందిస్తున్నామని, రికవరీ అవుతున్నాడని డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రిలో దేబశిష్ మాట్లాడుతూ..‘‘అమ్మానాన్న, అన్నయ్యలతో కలిసి భద్రక్​ వెళ్లేందుకు కోరమండల్ ఎక్స్​ప్రెస్ ఎక్కాను. అక్కడి నుంచి పూరి వెళ్లాలని ప్లాన్​చేశాం. రైలులో నేను అమ్మ పక్కన కూర్చున్న. ఒక్కసారిగా భారీ కుదుపు వచ్చింది. స్పృహ కోల్పోయా. కండ్లు తెరిసి చూస్తే అంతా చీకటి. డెడ్​బాడీల కింద ఉన్నట్లు తెలుసుకున్నాను” అని దేబశిష్​ చెప్పాడు.