వరల్డ్ కప్ గెలిచి నేటికి పదేళ్లు

వరల్డ్ కప్ గెలిచి నేటికి పదేళ్లు
  • ఆ అద్భుతానికి పదేళ్లు..

వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​: ఏప్రిల్‌‌‌‌ 2, 2011. ఇండియా క్రికెట్‌‌ హిస్టరీలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. 28 ఏళ్ల సుదీర్ఘ  నిరీక్షణకు తెరదించుతూ.. కోట్లాది మంది అభిమానుల కల నెరవేస్తూ..  క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ..  మహేంద్ర సింగ్‌‌ ధోనీ కెప్టెన్సీలోని ఇండియా క్రికెట్‌‌ టీమ్‌‌ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. క్రికెట్‌‌ ఆడే ప్రతీ జట్టు కల అయిన వన్డే వరల్డ్‌‌కప్‌‌ను రెండోసారి హస్తగతం చేసుకుంది.  ఇండియన్‌‌ క్రికెట్‌‌ దశ, దిశను మార్చిన ఈ అద్భుత ఘట్టానికి శుక్రవారంతో సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఆ నాడు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో గౌతమ్‌‌ గంభీర్‌‌, ధోనీ సూపర్బ్‌‌ బ్యాటింగ్‌‌తో  మన జట్టు  6 వికెట్లతో శ్రీలంకను ఓడించింది.  కులశేఖర బౌలింగ్‌‌లో ధోనీ లాంగాన్‌‌ మీదుగా కొట్టిన విన్నింగ్‌‌ సిక్సర్‌‌ వరల్డ్‌‌ క్రికెట్‌‌లోనే ఓ మధుర ఘట్టం కాగా..  మ్యాచ్‌‌ ముగిశాక ఆనందబాష్పాలతో కన్నీటి పర్యంతమైన సచిన్‌‌ను టీమ్‌‌మేట్స్‌‌ అంతా భుజాలపై ఎత్తుకొని గ్రౌండ్‌‌ మొత్తం తిప్పిన క్షణాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి.   ఆ జ్ఞాపకాలను క్రికెటర్లు, ఫ్యాన్స్‌‌ మరోసారి నెమరు వేసుకుంటున్నారు. కపిల్‌‌ దేవ్‌‌ నేతృత్వంలోని ఇండియా 1983లో తొలిసారి వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గింది. 

ఆ తర్వాత ఎంత మంది ప్రయత్నించినా మరో కప్‌‌ మన జట్టుకు అందని ద్రాక్షగానే మిగిలింది. కానీ, 2007 టీ20 వరల్డ్‌‌ కప్‌‌ సాధించిపెట్టిన ధోనీ నాలుగేళ్ల తర్వాత వన్డే కప్పును కూడా అందించాడు.  దాంతో, దేశ క్రికెట్‌‌లో న్యూ ఎరాకు నాందిపలుకుతూ..  మోస్ట్‌‌ సక్సెస్‌‌ ఫుల్‌‌  ఇండియన్‌‌ కెప్టెన్‌‌గా ఎదిగాడు. అలాగే, టీమ్‌‌ కూడా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే, 2015, 2019 ఎడిషన్లలో కప్పు వేటలో టీమిండియా సక్సెస్‌‌ కాలేకపోయింది. రెండుసార్లు సెమీస్‌‌లోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో మనం గతం గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇండియన్‌‌ క్రికెట్‌‌ తమ ఫ్యూచర్‌‌పై దృష్టి పెట్టాలని 2011 వరల్డ్‌‌ కప్‌‌ హీరోల్లో ఒకడైన గంభీర్‌‌ అంటున్నాడు. ‘ఈ రోజు ఎప్పుడూ నిన్నటిలా అనిపించదు. నా వరకైతే అంతే. మనం కప్పు నెగ్గి పదేళ్లు అవుతోంది. ఇది గర్వపడాల్సిన సందర్భమే అయినా నేను గతం గురించి ఎక్కువగా ఆలోచించను. ఇండియన్‌‌ క్రికెట్‌‌ మరింత ముందుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. వీలైనంత త్వరగా మనం ఇంకో వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గాలి’ అని గంభీర్‌‌ అభిప్రాయపడ్డాడు. సగటు క్రికెట్‌‌ అభిమాని కూడా కోరుకునేది అదే కదా!