పదేండ్లకే ఎవరెస్ట్ బేస్​ క్యాంప్​కు..

పదేండ్లకే ఎవరెస్ట్ బేస్​ క్యాంప్​కు..

చిన్న చిన్న కొండలు, గుట్టలు ఎక్కాలంటేనే ట్రైనింగ్ తీసుకుంటాం. అలాంటిది ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలంటే... ట్రైనింగ్​ తప్పనిసరి. కానీ, ఈ పదేండ్ల అమ్మాయి మాత్రం ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్​లో అడుగుపెట్టిన చిన్న వయసు అమ్మాయిగా రికార్డు సాధించింది. ముంబైకి చెందిన ఈ పాప పేరు రిధిమా మమానియా.

ఈ చిన్నారి సాహసి గురించి...

ముంబైలోని వర్లీలో ఉంటుంది రిధిమ. ఐదేండ్ల వయసు నుంచే కొండలు ఎక్కడం అంటే ఇష్టం తనకి. ఇంటికి దగ్గర్లో ఉండే శాస్త్రి గార్డెన్​కి  రోజూ ఉదయం 5 గంటలకు వెళ్లి,  చిన్న చిన్న  కొండలు ఎక్కడం, దిగడం ప్రాక్టీస్ చేసేది. ఫ్యామిలీతో కలిసి గోవాలోని దూద్​సాగర్ వాటర్​ఫాల్​ని చూసేందుకు వెళ్లిన రోజుని రిధిమ ఎప్పటికీ మర్చిపోదు. కొండ మీదకు వెళ్లేందుకు 21 కిలోమీటర్లు ట్రెక్కింగ్​ చేసింది.  అంత దూరం  ట్రెక్కింగ్ చేయడం అదే మొదటిసారి. ఆ ట్రిప్ రిధిమలో కాన్ఫిడెన్స్​ పెంచింది. ఆ తర్వాత సహ్యాద్రి పర్వతాల్లోని మహులీ, సొండాయ్, కర్నాలా, లోహగడ్ వంటి పర్వతాల్ని ఎక్కింది.  

మంచు దారిలో 11 రోజుల జర్నీ 

పోయిన నెల చివర్లో నేపాల్​కు చెందిన ‘సటోరి అడ్వెంచరస్’ గ్రూప్ ఎవరెస్ట్ ట్రిప్ ప్లాన్ చేసింది.   తల్లిదండ్రులు ఉర్మి, హర్షల్, మరికొంతమంది మౌంటెనీర్స్​తో కలిసి ఎవరెస్ట్ యాత్రకు బయల్దేరింది రిధిమ. ఈ ప్రయాణంలో చల్లని గాలులు, మంచు తుఫాన్లు వణికించినా భయపడలేదు. ఆక్సిజన్ అందక ఊపిరి సరిగా ఆడకున్నా, కాళ్లకు బొబ్బలు వచ్చినా వెనకడుగు వేయలేదు. 11 రోజుల ట్రెక్కింగ్ తర్వాత ఎవరెస్ట్ బేస్​ క్యాంప్​కి చేరింది.  5,364 మీటర్ల ఎత్తు, మైనస్ పది డిగ్రీల సెల్సియస్ ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లగానే సంతోషంతో ఎగిరి గెంతులు వేసింది. జాతీయ జెండాని చూపిస్తూ తాను అనుకున్నది సాధించానంటూ తెగ మురిసి పోయింది. ‘‘బేస్​క్యాంప్​కి చేరిన తర్వాత రిధిమని హెలికాప్టర్​లో కిందకు పంపిద్దాం అనుకున్నాం. కానీ, తను నడుస్తానన్నది. దాంతో తనతో పాటు నలుగురం ట్రెక్కర్స్ వెనక్కి​ వచ్చేశాం’’ అంది రిధిమ తల్లి. 

‘‘స్కేటింగ్​తో పాటు ట్రెక్కింగ్ చేయడం అంటే ఇష్టం. చిన్న చిన్న కొండలు ఎక్కిన తర్వాత  కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకని ఎవరెస్ట్ బేస్ క్యాంప్​కి వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నా. చల్లని గాలులు వీస్తున్నా, మంచు పెళ్లలతో నిండిన దారిలో  నడిచాను. మంచు తుఫాన్లని చూడడం   కొత్త ఎక్స్​పీరియెన్స్. పర్వతాల మీది చెత్తను తొలగించడంతో పాటు బాధ్యతగల ట్రెక్కర్​గా ఉండడం ఎంత ముఖ్యమో ఈ ట్రిప్ ద్వారా తెలుసుకున్నా. స్కేటింగ్ రింక్​ అయినా, ఎవరెస్ట్ బేస్​ క్యాంప్ అయినా పట్టుదల ముఖ్యం. అప్పుడే అనుకున్నది సాధిస్తాం” అంటున్న రిధిమ ప్రస్తుతం బాంద్రాలోని మెట్ రిషికుల్ విద్యాలయలో ఐదో క్లాస్ చదువుతోంది.