100కు పైగా వీధి కుక్కల మృతి.. గ్రామ పంచాయతీ పనేనా..?

100కు పైగా వీధి కుక్కల మృతి.. గ్రామ పంచాయతీ పనేనా..?

వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన అమానవీయ ఘటన శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లిలో జరిగింది. ఈ ఘటనలో 100కు పైగా వీధి కుక్కలు మృతి చెందాయి. దీంతో చలించిన జంతు ప్రేమికులు శామీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. 

ఈ సంఘటనపై శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు శనివారం (ఏప్రిల్ 29) రాత్రి ఆలస్యంగా ఫిర్యాదు అందింది. తుర్కపల్లి గ్రామంలో వీధి కుక్కలకు విష ప్రయోగం జరిగిందని.. బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జంతు ప్రేమికురాలు శశికళ. అంతేకాకుండా ఓ వీధి కుక్క కళేభరాన్ని తీసుకుని శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. 

దాంతో పోలీసులు అనుమానస్పద స్థితిలో శునకాలు మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన శుకనానికి పశువైద్యుల చేత పోస్టుమార్టం చేయించారు పోలీసులు. అయితే, ఈ విషయంపై శామీర్ పేట ఎస్సై మునీందర్ తుర్కపల్లి గ్రామంలో విచారణ చేయగా.. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారుల నుంచి సరైన సమాచారం రాలేదు. 

శునకం మృతికి సంబంధించిన రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. వీధి కుక్కల మృతికి గ్రామపంచాయతీ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఫిర్యాదు చేసింది జంతు ప్రేమికురాలు శశికళ.