- మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి/వీపనగండ్ల, వెలుగు : వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి నూరు శాతం సబ్సిడీపై సోలార్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా మంత్రి స్వగ్రామమైన పెద్దదగడను ఎంపిక చేసిందని తెలిపారు. మంగళవారం పెద్దదగడ గ్రామంలో నిర్వహించిన ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ సోలార్ కనెక్షన్ ఇస్తారని, రైతులు తమ బోరుబావుల వద్ద కూడా సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
విద్యుత్, సోలార్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగి దరఖాస్తులు స్వీకరించి వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. గతంలో ఈ గ్రామానికి మొదటి విడతలో 29 ఇండ్లు మంజూరు కాగా, అందులో 18 ఇండ్లు మాత్రమే కట్టుకున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి అదనంగా మరో 100 ఇండ్లను వెంటనే శాంక్షన్ చేయిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
