వంద శాతం ఓటరు నమోదు చేసుకుని ఆదర్శంగా నిలవాలి : జీహెచ్​ఎంసీ కమిషనర్

వంద శాతం ఓటరు నమోదు చేసుకుని ఆదర్శంగా నిలవాలి : జీహెచ్​ఎంసీ కమిషనర్

సీఈవో వికాస్​రాజ్ వెల్లడి

ఓయూ, వెలుగు: పద్దెనిమిదేండ్లు నిండినోళ్లు ఇకపై ఏడాదిలో నాలుగుసార్లు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్ చెప్పారు. ఇంతకు ముందు ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటరు నమోదుకు అవకాశం ఉండేది. చట్ట సవరణ చేసినందున ఇక నుంచి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న నమోదుకు వెసులుబాటు దొరికింది. 18 ఏండ్లు నిండినోళ్లంతా ఈ తేదీల్లో తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సీఈవో కోరారు. 

బుధవారం ఓయూ క్యాంపస్​లోని ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఓటరు నమోదు, ఆధార్ కార్డు అనుసంధానంపై అవగాహన కార్యాక్రమాన్ని వికాస్ రాజ్ ప్రారంభించి మాట్లాడారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద జాబితాను ఏర్పాటు చేస్తున్నామని, అభ్యంతరాలు డిసెంబర్ 8దాకా స్వీకరిస్తామని చెప్పారు. ఫైనల్ ముసాయిదా జాబితాను జనవరి 5న విడుదల చేస్తామన్నారు. జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. కాలేజీలో వంద శాతం ఓటరు నమోదు చేసుకుని ఆదర్శంగా నిలవాలన్నారు.