8 ఏండ్లలో సొంత మీడియా సంస్థలకు వెయ్యి కోట్ల యాడ్స్ ఇచ్చిన్రు

8 ఏండ్లలో సొంత మీడియా సంస్థలకు వెయ్యి కోట్ల యాడ్స్ ఇచ్చిన్రు
  • అన్నింట్లోనూ అవినీతి: వివేక్ వెంకటస్వామి 
  • ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని ఫైర్ 

కామారెడ్డి/పిట్లం, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీమ్ లన్నీ ఫెయిలయ్యాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి, కమీషన్ల కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. ఇప్పుడవి చాలవన్నట్లు మరో రూ.25 వేల కోట్లు దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రూ.40 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టారు. ఇంటింటికీ నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడా ఇంటింటికీ నీళ్లు రావడం లేదు. ఇందులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారు” అని ఆయన ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు ఫామ్​హౌస్​లు కట్టుకున్నారని.. కానీ పేదలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా గోస – బీజేపీ భరోసా ప్రోగ్రామ్ లో భాగంగా బుధవారం ఏడో రోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని పెద్ద తడ్కపల్లి, పెద్ద కొడప్ గల్ మండల కేంద్రం, తుక్​దాల్, చిన్న తడ్కపల్లి, బేగంపూర్ తదితర గ్రామాల్లో వివేక్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడారు. 

ఫామ్ హౌస్ సెక్యూరిటీకి 78 కోట్లు... 

కేసీఆర్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. సీఎం ఫామ్ హౌస్ వద్ద సెక్యూరిటీ కోసం రూ.78 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. కొత్తగా సెక్రటేరియెట్ నిర్మాణం చేపట్టి, రూ.వెయ్యి కోట్లు వృథా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ యాడ్స్ పేరిట భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ తన కుటుంబసభ్యులకు చెందిన మీడియా సంస్థలకు 8 ఏండ్లలో రూ.వెయ్యి కోట్ల యాడ్స్ ఇచ్చారు. ఆ సంస్థల్లో సీఎం కోడలు డైరెక్టర్ గా ఉన్నారు” అని చెప్పారు. ‘‘రాష్ట్ర సర్కార్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. కేంద్రం నుంచి  రూ.3 లక్షల కోట్లు నిధులు వచ్చాయి. ఇవిగాక రాష్ర్ట పన్నులతోనూ ఆదాయం వచ్చింది. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ, ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు” అని అన్నారు. బంగారు తెలంగాణ ఏమో గానీ, బంగారు కల్వకుంట్ల కుటుంబమైందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, కాటిపల్లి వెంకటరమణరెడ్డి, రాము, తేలు శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.