ఢిల్లీకి తెలంగాణ  కాంగ్రెస్ దండు..80 బస్సులు, 600 కార్లలో తరలిన శ్రేణులు

ఢిల్లీకి తెలంగాణ  కాంగ్రెస్ దండు..80 బస్సులు, 600 కార్లలో తరలిన శ్రేణులు
  • ‘ఓట్ బచావో –దేశ్ బచావో’కు 10 వేల మంది
  • 80 బస్సులు, 600 కార్లలో తరలిన శ్రేణులు
  • తెలంగాణ భవన్‌‌‌‌లో ప్రత్యేక కంట్రోల్ రూం
  • నేడు ర్యాలీని ప్రారంభించనున్న సీఎం రేవంత్

 

న్యూఢిల్లీ, వెలుగు: హైకమాండ్ పిలుపు మేరకు ‘ఓట్ బచావో –దేశ్ బచావో’ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ శ్రేణులు  పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రం నుంచి 10 వేలకుపైగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు. సుమారు 80 బస్సులు, 600 పైగా కార్లు, రైళ్లు, విమానాల్లో శనివారం రాత్రికే ఢిల్లీ చేరుకున్నారు. వీరి  కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం వసతి, భోజన ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ బార్డర్‌‌‌‌లో పోలీసులు విధించిన ఆంక్షలతో పలు బస్సులను కాసేపు నిలిపి వేసినట్టు పలువురు నేతలు మీడియాకు తెలిపారు. ఢిల్లీలో చలికాలం రూల్స్ నేపథ్యంలో.. బీ6 వాహనాలను మాత్రమే అనుమతించినట్టు తెలిసింది. తెలంగాణ భవన్‌‌లో కంట్రోల్ రూం 

రాష్ట్రం నుంచి వచ్చే పార్టీ కార్యకర్తలు, నేతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం ఆదేశాలతో రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. ఈ భారీ ర్యాలీ కోసం వచ్చే పార్టీ కేడర్‌‌‌‌కు సహకరించడంతోపాటు నిరసనల్లో ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేసినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా, ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనా ఈ కంట్రోల్ రూం ఆశ్రయించాలని పార్టీ సూచించింది. ఈ కంట్రోల్ రూం బాధ్యతలను ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌‌‌‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల, బలరాం నాయక్‌‌కు సీఎం అప్పగించారు.  

రాంలీలా మైదానాన్ని పరిశీలించిన ఎంపీలు...

ఢిల్లీ చేరుకొని అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదాన్‌‌లో సభ, ఏర్పాట్లను పరిశీలించాలని ఎంపీలు, ముఖ్య నేతలను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఎంపీలు మల్లు  రవి, చామల, ఇతర నేతలు సభా స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి దాదాపు 10 వేలకుపైగా పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నట్టు చెప్పారు. 

కాంగ్రెస్ నేతలతో తెలంగాణ భవన్ కళకళ 

రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ చేరుకొన్న పార్టీ శ్రేణులతో తెలంగాణ భవన్ కళకళలాడింది. భవన్ చుట్టూరా.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు పార్టీ కార్యకర్తల కోసం భవన్‌‌లోనే లంచ్ ఏర్పాటు చేసేలా నేతలు ప్లాన్ చేశారు. 

ఫ్లాగ్ ఆఫ్ చేయనున్న సీఎం 

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ... రాంలీలా మైదాన్‌‌లో జరగనున్న ‘ఓట్ బచావో –దేశ్ బచావో’ ఆందోళనకు రాష్ట్ర నేతలు తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ, ముఖ్య నేతలు తెలంగాణ భవన్‌‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అక్కడి నుంచి రాంలీలా మైదాన్ కు ర్యాలీగా సాగుతారని వెల్లడించాయి. ఈ ర్యాలీని సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు