రాంచీ: నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పోటీల తొలిరోజే అద్భుతమైన డ్రామా చోటుచేసుకుంది. మెన్స్ 100 మీటర్ల పరుగు పందెంలో నిమిషాల వ్యవధిలోనే జాతీయ రికార్డు రెండుసార్లు బద్దలైంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్ హీట్స్‌లో గురిందర్‌వీర్ సింగ్ (రిలయన్స్) 10.17 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త నేషనల్ రికార్డు సృష్టించాడు.
తద్వారా అనిమేష్ కుజూర్ (ఒడిశా) పేరిట ఉన్న 10.18 సెకన్ల పాత రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ కొత్త రికార్డు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే నిలిచింది. ఆ వెంటనే జరిగిన రెండో సెమీఫైనల్ హీట్‌లో అనిమేష్ కుజూర్ 10.15 సెకన్లలోనే పరుగును ముగించి తన రికార్డును తిరిగి సొంతం చేసుకున్నాడు. శనివారం జరగబోయే ఫైనల్ రేసులో వీరిద్దరి మధ్య మరోసారి హోరాహోరీ పోరు సాగనుంది.
