చైనా మాంజాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. సిటీ వ్యాప్తంగా మాంజా దుకాణాలపై భారీ దాడులు నిర్వహించారు పోలీసులు. ఇప్పటిదాకా మొత్తం 103 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.చైనా మాంజా అమ్ముతున్న 143 మందిని అరెస్ట్ చేసి.. రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 5 వేల 226 మాంజా బాబిన్లు సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు
హైదరాబాద్ లో జోన్ వారీగా నమోదైన కేసులు:
- సౌత్ వెస్ట్ జోన్‌లో అత్యధికంగా 34 కేసులు
- సౌత్ జోన్‌లో 27 కేసులు నమోదు
- ఈస్ట్ జోన్‌లో 18 కేసులు
- సౌత్ ఈస్ట్ జోన్‌లో 9 కేసులు
- సెంట్రల్, నార్త్, వెస్ట్ జోన్లలో కలిపి 15 కేసులు
చైనా మాంజాపై ఆపరేషన్ లో హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే 67 కేసులు నమోదు కాగా.. 87 మంది అరెస్టు చేసి రూ.68.78 లక్షల సరుకు సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. గురువారం ( జనవరి 8 ) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీపీ సజ్జనార్. సంక్రాంతి అంటేనే పతంగులు అని.. ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ మరొకరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు.
తెలంగాణలో చైనా మాంజాపై నిషేధం ఉందని.. చైనీస్ మాంజా వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయని అన్నారు సజ్జనార్. మాంజా దుకాణాల్లో దాడులు ముమ్మరం చేశామని.. చైనా మాంజాతో మనుషులు, పక్షులు, జంతువులకు ప్రాణ హాని ఉంటుందని.. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ తో మాంజా వల్ల పిల్లల కు విధ్యుత్ షాక్ కొట్టే ప్రామాదం ఉందని అన్నారు సజ్జనార్.
