
- ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ
బషీర్బాగ్, వెలుగు: ఉప్పల్ పరిధిలోని మల్లాపూర్ హెచ్.సి.ఏ.ఎల్ ఏరియాలో ఓ పాతబడిన గోదాంలో 106 కిలోల గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో ఉప్పల్ ఎక్సైజ్ డీటీఎఫ్, ఎక్సైజ్ పోలీసు బృందాలు సంయుక్తంగా దాడి చేశారు. గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయిని ఒడిశా నుంచి కారులో తరలించినట్టు అంగీకరించారు. గోదాంలో సోదాలు నిర్వహించగా, 2 కిలోలు, ఒక కిలో చొప్పున ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 106 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.53 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఈ దాడికి సంబంధించిన వివరాలను నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ లో అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ మీడియాకు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో ఏ1 రాంబాబు (ఒడిశా, మల్కానగిరి జిల్లా), ఏ2 కట్ల వివేక్ రెడ్డి (ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా)ని అరెస్ట్ చేశామని, ఏ3 దగ్గుమల్లి మధు కిరణ్ (మేడిపల్లి, మేడ్చల్ జిల్లా) పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడుల్లో మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, ఏఈఎస్ ముకుంద రెడ్డి, ఉప్పల్ ఎస్‌హెచ్‌ఓ ఓంకార్, డీటీఎఫ్ సీఐ భరత్ భూషన్, ఎస్ఐలు నరేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.