
పద్మారావునగర్, వెలుగు: ‘‘రోజ్ గార్ మేళా’’ పథకంలో భాగంగా ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో 5 లక్షల ఉద్యోగాలను మహిళలకే ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం ‘‘రోజ్ గార్ మేళా’’ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ బోయిగూడలోని రైల్ కళారంగ్ భవన్ లో 244 మంది రైల్వే ఉద్యోగులకు కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో నేషనల్ హైవేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. లక్షా 20 వేల కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. రూ.650 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను రైల్వే శాఖ చేపట్టిందన్నారు. చర్లపల్లి రైల్వే శాటిలైట్ టెర్మినల్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కె.లక్ష్మణ్, బండి సంజయ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
2 లక్షల ఖాళీల భర్తీ ఎప్పుడు?: సంజయ్
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారని సీఎం కేసీఆర్ను బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ ప్రశ్నించారు. శనివారం సికింద్రాబాద్ బోయిగూడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నోటికి హద్దు, పద్దు ఉండదని, నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనన్నారు.