- జూన్ నాటికి మరో లక్ష ఇండ్లు సిద్ధం: మంత్రి పొంగులేటి
- ఇప్పటికే పూర్తై ఖాళీగా ఉన్న ఇండ్లను
- అర్హులకు కేటాయిస్తం
- సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్ తీసుకొస్తం
- జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి
- 1,4-15 స్థలాలను గుర్తించామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా లక్షా 12 వేల ఇందిరమ్మ ఇండ్లు గృహ ప్రవేశాలకు రెడీగా ఉన్నాయని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే జూన్ నాటికి మరో లక్ష ఇండ్లు రెడీ అవుతాయన్నారు. ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. గతంలో గృహలక్ష్మి పథకం కింద ప్రారంభించి ఆగిపోయిన ఇండ్లకు నిధులు ఇస్తామని, దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
బుధవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బీజేపీ ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, ధనపాల్ సూర్యానారాయణ గుప్తా, పాయల్ శంకర్, రామారావు పవార్ తో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక -99 రోజుల ప్లాన్ లో భాగంగా పూర్తిచేస్తున్నట్టు చెప్పారు.
ఖాళీగా ఉన్న ఇండ్లను అర్హులైన పేదలకు కేటాయిస్తామని చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. “గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇండ్లు మంజూరు చేసి హైదరాబాద్ కు లక్ష ఇండ్లు కేటాయించింది. వీటిలో 78,861 ఇండ్లు పూర్తయినా మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
21, 838 ఇండ్లు పునాదులకే పరిమితమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 26 కాలనీలు అసంపూర్తిగా ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చాక కొత్తగా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు చేశాం. రూ. 738 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాం. గత సర్కారు గ్రేటర్ లో 23 వేల మందికి డబుల్ ఇండ్లు కేటాయించగా అవి దూరంగా ఉన్నాయని వాటిల్లో ఎవరూ ఉండడం లేదు. అందులో 12 వేలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇండ్లను అర్హులను కేటాయిస్తం” అని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఇండ్ల కమిటీల్లో ఎమ్మెల్యేలకూ చోటు!
రాష్ట్రంలో తొలివిడత 4.50 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, ప్రత్యేకంగా చెంచులు, ఐటీడీఏ పరిధిలో గిరిజనులకు 12 వేల ఇండ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలకు సర్పంచ్ అధ్యక్షుడిగా ఉంటారని, ఆయన ఆధ్వర్యంలోని కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తే కలెక్టర్ పరిశీలన, జిల్లా ఇన్చార్జ్మంత్రి ఆమోదంతో కేటాయింపులు జరుగుతాయన్నారు. రానున్న రోజుల్లో ఈ కమిటీల్లో ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు.
మరిన్ని గోదాంలు నిర్మిస్తున్నాం: తుమ్మల
రాష్ట్రంలో ప్రస్తుతం 80.54 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో 1,377 గోదాంలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. బుధవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో గోదాంల విషయమై ఎమ్మెల్యేలు బాలునాయక్, జయవీర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వచ్చే రెండేండ్లలో అదనంగా మరో 5 లక్షల టన్నుల సామర్థ్యంతో గోదాములు నిర్మించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
40,349 ఇండ్లకు సోలార్ రూఫ్‌టాప్ : భట్టి విక్రమార్క
రాష్ట్రంలో గృహ, వ్యవసాయ రంగానికి సంబంధించి 81 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బుధవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బాలు నాయక్, కసిరెడ్డి నారాయణ రెడ్డి అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానమిచ్చారు. ‘పీఎం సూర్యఘర్’ కింద రాష్ట్రంలో 40,349 ఇండ్లకు 2 కిలోవాట్స్ సామర్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ పంపుసెట్ల కోసం ‘పీఎం కుసుమ్ కాంపోనెంట్’ కింద 7.5 కిలో వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు.
