మిజోరం ఎన్నికల బరిలో 112 మంది కోటీశ్వరులు

మిజోరం ఎన్నికల బరిలో 112 మంది కోటీశ్వరులు
  • మిజోరం ఎన్నికల బరిలో 112 మంది కోటీశ్వరులు
  • నామినేషన్ ​వేసిన 64 శాతం మంది కరోడ్ పతులే
  • ఆప్​ స్టేట్​ చీఫ్​కు అత్యధికంగా రూ.69 కోట్ల ఆస్తులు

ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 174 మంది అభ్యర్థుల్లో 112 మంది కోటీశ్వరులే. నవంబర్​7న ఎన్నికలు జరగనున్న మిజోరంలో ఇప్పటికే నామినేషన్​గడువు పూర్తయింది. మిజోరం అసెంబ్లీ బరిలో 16 మంది మహిళలు సహా మొత్తం174 మంది అభ్యర్థులు నిలిచారు. అభ్యర్థుల అఫిడవిట్​ల ప్రకారం.. 64.4% మంది అభ్యర్థులు రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు. 

ఐజ్వాల్ ​నార్త్​–3 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్ ​రాష్ట్ర అధ్యక్షుడు రూ. 68.93 కోట్ల విలువైన ఆస్తులతో అత్యధిక ధనవంతుడిగా నిలువగా, ఆయన తర్వాత రూ. 55.6 కోట్ల ఆస్తులతో కాంగ్రెస్‌‌ లీడర్ ఆర్ వన్‌‌ లాల్ట్‌‌ లుంగా(సెర్చిప్ సీటు), జోరామ్ పీపుల్స్ మూవ్‌‌మెంట్‌‌కు చెందిన హెచ్ గింజలాలా (చంఫై నార్త్) రూ. 36.9 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. వీరందరి ఆదాయానికి మూలం వ్యాపారమే. సెర్చిప్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న రామ్‌‌లున్- ఎడెనా అత్యంత పేద అభ్యర్థి. ఆయనకు రూ.1,500 విలువైన చరాస్తులు మాత్రమే ఉన్నాయి. 

మొత్తం 174 మందిలో ఐదుగురు (జేపీఎం ముగ్గురు, ఎమ్ఎన్ఎఫ్​ఒకరు, బీజేపీ ఒకరు) క్రిమినల్​ కేసులు ఎదుర్కొంటున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలోనూ టుయిచాంగ్ స్థానం నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్న  డిప్యూటీ సీఎం తాన్‌‌పుయ్ అత్యధిక వయసు(80) ఉన్న వ్యక్తి కాగా.. స్వతంత్ర అభ్యర్థిగా రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి లాల్రువాట్‌‌ఫెలి హ్లాండో, బీజేపీ అభ్యర్థి ఎఫ్ వాన్‌‌మింగ్‌‌ తంగా అతి పిన్న(31) వయస్కులు.

అగ్రనేతల ప్రచారం

మిజోరం ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ.. కాంగ్రెస్, బీజేపీలు అగ్ర నేతలతో ప్రచారం చేయించాలని నిర్ణయించాయి. నవంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, శశి థరూర్‌‌లు నవంబర్ 3, 4 తేదీల్లో మిజోరంలో పర్యటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. 

రాష్ట్రంలో మైనారిటీలు ఎక్కువగా ఉండే చోట ప్రియాంకా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రాహుల్​గాంధీ రాష్ట్రంలో పర్యటించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహా బీజేపీ అగ్రనేతలు కూడా మిజోరంలో పర్యటించే అవకాశం ఉంది.

రాజస్థాన్​లో కాంగ్రెస్​ 2 గ్యారెంటీలు.. సీఎం ​గెహ్లాట్ ప్రకటన

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బుధవారం కాంగ్రెస్ తరఫున రెండు గ్యారెంటీలు ప్రకటించారు. హస్తం పార్టీని మళ్లీ గెలిపిస్తే.. 1.05 కోట్ల పేద కుటుంబాలకు రూ.500కే గ్యాస్ ​సిలిండర్​, గృహలక్ష్మి పథకంలో భాగంగా పేదింటి మహిళకు ఏటా రూ.10 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఝుంఝునులో జరిగిన ప్రచార ర్యాలీలో గెహ్లాట్ మాట్లాడారు. గృహలక్ష్మి గ్యారంటీ పథకం కింద కుటుంబ పెద్ద అయిన మహిళకు రూ.10 వేల ఆర్థిక చేయూత అందించనున్నట్లు తెలిపారు. రాజస్థాన్​లో నవంబర్ 25న పోలింగ్ జరగనుంది.