హైదరాబాద్ సిటీలో 113 కొత్త ట్రాఫిక్సిగ్నల్స్.. పాదాచారుల భద్రతకు 78 పెలికాన్ సిగ్నల్స్

హైదరాబాద్ సిటీలో 113 కొత్త ట్రాఫిక్సిగ్నల్స్.. పాదాచారుల భద్రతకు 78  పెలికాన్ సిగ్నల్స్
  • గ్రేటర్ లో ఇప్పటికే 404 సిగ్నల్స్
  • ఇందులో 169 పాత సిగ్నల్స్ అప్​డేట్​ చేయనున్న బల్దియా  
  • పాదాచారుల భద్రతకు 78  పెలికాన్ సిగ్నల్స్  

 హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​సమస్య తలెత్తడానికి సిగ్నల్స్​లేకపోవడమూ కారణమవుతోంది. దీన్ని గుర్తించిన సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల జరిగిన సమావేశంలో కొత్త సిగ్నల్స్​ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే జంక్షన్లను గుర్తించిన జీహెచ్ఎంసీ రూ.71 కోట్లతో కొత్తగా113 కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అలాగే, మరిన్ని ప్రాంతాలను గుర్తించే పనిలో పడింది. సిటీలో ఇప్పటికే 404 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండగా, ఇందులో 169 సిగ్నల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాతవి కావడంతో వాటిని ఏటీఎస్ సీ (అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్)గా మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే కొన్నింటిని అప్​డేట్​చేశారు. వాహనాల రద్దీని గుర్తించే సెన్సార్లను బిగించడం వల్ల అవి సిగ్నల్ టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవసరానికి అనుగుణంగా ఆటోమెటిక్​గా మారుస్తాయి. దీనివల్ల ట్రాఫిక్​ఎక్కువగా ఉండే రూట్​కు ఎక్కువ సెకన్లు..తక్కువగా ఉండే రూట్​లో తక్కువ సెకన్లు వచ్చేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. 

పాదచారుల కోసం ..

పాదాచారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ 78 పెలికాన్  సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సిగ్నల్స్​దగ్గర ఉండే బటన్లను నొక్కడం ద్వారా  వాహనాలకు రెడ్​సిగ్నల్​పడుతుంది. దీనివల్ల పాదచారులు ఎప్పుడంటే అప్పుడు ఇబ్బంది లేకుండా రోడ్డు దాటే అవకాశం ఉంటుంది. ఇప్పటికే నిమ్స్​హాస్పిటల్ వంటి ప్రాంతాల్లో ఇటువంటి సిగ్నల్స్​ఉన్నా అవగాహన లేక పాదచారులు వీటిని 
వాడలేకపోతున్నారు.