దేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో వేగంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ (గురువారం) ఒక్క రోజే మరో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 31కి చేరాయని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఇవాళ ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారిలో తొమ్మిదేళ్ల చిన్నారి, మరో పదకొండేళ్ల అమ్మాయి కూడా ఉన్నారని ఆయన చెప్పారు.

మరోవైపు కేరళలోనూ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే తొమ్మిది కొత్త కేసులు నమోదు కాగా.. ఇవాళ మరో ఐదుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారేనని, వారికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ రావడంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్ చేయగా.. ఒమిక్రాన్ అని తేలిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ కొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 29కి చేరింది. తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 38కి చేరింది. నాలుగు శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉందని నిన్న రాత్రి తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే రాష్ట్రాల్లో మళ్లీ నౌట్‌ కర్ఫ్యూలు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.