ఈ నెలలో రూ.5 వేల కోట్ల అప్పు

ఈ నెలలో రూ.5 వేల కోట్ల అప్పు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ మరో రూ.1000 కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం ఆర్​బీఐ నిర్వహించిన బాండ్ల వేలంలో పాల్గొని ఈ అప్పును సమకూర్చుకున్నది. దీంతో ఈ నెలలోనే చేసిన మొత్తం అప్పు రూ.5 వేల కోట్లకు చేరుకుంది. ఒకవైపు కేంద్రం రాష్ట్ర అప్పులను కుదించిందని సీఎం కేసీఆర్ చెబుతుంటే.. మరోవైపు ఆర్​బీఐ నుంచి అప్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ నెలలో రూ.3 వేల కోట్లే తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టుకున్నది. అయితే మరో రెండు వేల కోట్లు అదనంగా తీసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తీసుకున్న అప్పుల మొత్తం రూ.12 వేల కోట్లు దాటింది. కేవలం రెండు నెలల్లోనే ఈ అప్పు చేసింది. 

రూ.53 వేల కోట్ల అప్పులు తీసుకోవాలని..

ఈ ఫైనాన్షియల్ ఇయర్​లో రాష్ట్ర ప్రభుత్వం రూ.53 వేల కోట్ల అప్పులు తీసుకోవాలని బడ్జెట్​లో పెట్టుకున్నది. అయితే  కేంద్రం రాష్ట్ర అప్పులను రూ.23 వేల కోట్లకు కుదించినట్లు సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఈ లెక్కన రాష్ట్రం ఇంకా రూ.11 వేల కోట్లు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతకు ముందు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్​చాట్​లో భాగంగా రూ.19 వేల కోట్లు అప్పులకు కోత పడిందని చెప్పారు. దీనిపై ఆర్థిక శాఖ ఆఫీసర్లు నోరు మెదపడం లేదు. దీంతో అసలు ఎంత అప్పు వస్తుంది ? ఎవరు కరెక్ట్​ చెబుతున్నారనే దానిపై గందరగోళం నెలకొంది.