- ఫస్ట్ క్లాస్ చిన్నారులకు ‘విద్యా ప్రవేశ్’
- ఈ నెల18 నుంచి ఆగస్టు 28 వరకు అమలు
- పుస్తకాలు పక్కనపెట్టి.. ఆటలు, పాటలతోనే బోధన
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడికి వచ్చే చిన్నారులకు చదువు అంటే భయం పోగొట్టి, ఆడుతూ పాడుతూ బడికి అలవాటు పడేలా విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఒకటో తరగతిలో కొత్తగా చేరే విద్యార్థుల కోసం ‘విద్యా ప్రవేశ్’(స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్) పేరుతో 12 వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయబోతోంది.
2026–27 విద్యాసంవత్సరానికి గాను గురువారం ప్రారంభమైన ఈ ప్రోగామ్.. ఆగస్టు 28 వరకు జరగనున్నది. ఈ ప్రోగ్సామ్ రాష్ట్రవ్యాప్తంగా సర్కారు, ఎయిడెడ్ ప్రైమరీ స్కూళ్లలో కొనసాగించేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రోగ్రామ్ గైడ్ లైన్స్‌ను తాజాగా ఎస్సీఈఆర్టీ జి.రమేశ్ రిలీజ్ చేశారు.
పుస్తకాలతో పనిలేదు..
చిన్నారులు అంగన్‌వాడీ లేదా ఇంటి వాతావరణం నుంచి నేరుగా స్కూల్‌కు వస్తుంటారు. వారు బడికి అలవాటు పడేందుకు తొలి 3 నెలల పాటు (60 వర్కింగ్ డేస్) పుస్తకాలతో కుస్తీ పట్టించకుండా, కేవలం చిన్న కార్యక్రమాల ద్వారానే బోధన సాగించనున్నారు. ఈ 12 వారాల కాలంలో విద్యార్థులపై పుస్తకాల భారం ఉండకూడదని విద్యా శాఖ అధికారులు ఇప్పటికే గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. సాధారణ పాఠ్యపుస్తకాల బోధన, బోర్డు మీద ఉన్నది చూసి రాయించడం, అక్షరాలను పలికించడం, డ్రిల్లింగ్ చేయించడం వంటి పద్ధతులను పూర్తిగా పక్కనపెట్టాలని ఆదేశించారు.
వీటికి బదులుగా సర్కిల్ టైమ్, ఇండోర్ -అవుట్‌డోర్ ఆటలు, బొమ్మలు గీయడం, మట్టితో వస్తువుల తయారీ, చిన్న చిన్న కథలు చెప్పడం వంటి కృత్యాల ద్వారా పిల్లలను భాగస్వాములను చేయాలని టీచర్లకు సూచించారు. పిల్లల శారీరక, మానసిక వికాసం, సామాజిక -భావోద్వేగ ఎదుగుదల, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
నోట్స్ రాయడం.. బట్టీ పట్టడం ఉండవు..
విద్యా ప్రవేశ్ అమలులో ఉన్న టైమ్‌లో విద్యార్థులతో బలవంతంగా కాపీలు రాయించడం, పాఠాలు బట్టీ పట్టించడం వంటి పనులు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కేవలం కృత్యాల ద్వారానే వారిలో ఆలోచనా శక్తిని పెంపొందించాలని సూచించింది. పిల్లల పురోగతిని పర్యవేక్షించేందుకు 20వ రోజు, 40వ రోజు, 60వ రోజున మూడు దశల్లో అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు. చిన్నారుల భాషా పరిజ్ఞానం, ప్రవర్తన, పరిసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ కార్యక్రమ అమలుకు సంబంధించి స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్‌ను ఇప్పటికే స్కూళ్లకు అందించారు. స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓలు, డీఈఓలు నిరంతరం స్కూళ్లను సందర్శించి ప్రోగ్రామ్ అమలు తీరును పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు. విద్యా ప్రవేశ్ మాడ్యూల్ ఇప్పటికే అన్ని స్కూళ్లకు చేరిందని, షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
