సిద్దిపేట మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. మూడు దశాబ్దాలుగా ఎగరని కాంగ్రెస్ జెండా

సిద్దిపేట మున్సిపాల్టీపై కాంగ్రెస్ ఫోకస్.. మూడు దశాబ్దాలుగా ఎగరని కాంగ్రెస్ జెండా

 

  • పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు
  • మైనంపల్లికి బాధ్యతలు    
  • గెలుపు గుర్రాల వేటలో నేతలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట బల్దియాపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మూడు దశాబ్దాల పాటు బల్దియాలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌‌‌‌.. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ముఖ్య నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మరో నాలుగైదు నెలల్లో సిద్దిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే  అవకాశం ఉండటంతో ముఖ్య నేతలు, కార్యకర్తల్ని సమాయత్తం చేసే దిశగా కసరత్తును ప్రారంభించారు. ఇటీవల జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లో సిద్దిపేట కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 

సిద్దిపేట బల్దియాను కాంగ్రెస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు ఎలా పనిచేయాలనే విషయంపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశానికి పట్టణ, నియోజకవర్గ నేతలతో పాటు 43 వార్డులకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల నాటికి గ్రూపు వివాదాలను పక్కన బెట్టి నేతలందరిని ఒకేతాటి పైకితెచ్చి సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. 

ఎన్నికల బాధ్యతలు మైనంపల్లికి

బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేటలో కాంగ్రెస్ విజయం సాధించాలంటే మైనంపల్లి హన్మంతరావు లాంటి నేతకే  బాధ్యతలు అప్పగించాలని టీపీసీసీ నేతలు నిర్ణయించినట్టు సమాచారం. కాగా ప్రజలకు మరింత దగ్గరవడం కోసం మైనంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా సంస్థలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో రెండు బోర్లు వేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈక్రమంలో ప్రతి శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో రెండు వార్డుల్లో మైనంపల్లి పర్యటిస్తుండగా వార్డుకు రెండు బోర్లు ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మైనంపల్లికి సిద్దిపేట మున్సిపాలిటీ బాధ్యతలు అప్పగించే విషయంలో కొందరు గుర్రుగా ఉన్నారనే ప్రచారం జరుగుతుండగా వచ్చే కొద్దిరోజుల్లో టీపీసీసీ అధికారికంగా పేరును ప్రకటించనుంది. 

ఐక్యతకు అడ్డంకిగా గ్రూపు వివాదాలు

సిద్దిపేట కాంగ్రెస్‌‌‌‌లో గ్రూపు వివాదాలు ఐక్యతకు అడ్డంకిగా మారుతున్నాయి. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో నేతలు ఐక్యంగా పనిచేయకపోతే పార్టీకి నష్టమనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌‌‌లో జరిగిన సమావేశానికి ఒక వర్గమే హాజరు కావడంతో కింది స్థాయి కార్యకర్తల్లో కన్ఫ్యూజన్‌‌‌‌ నెలకొంది. 

ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా సిద్దిపేట నుంచి పార్టీ నుంచి గెలిచే వ్యక్తికి మంత్రి పదవిని ఇస్తానని బహిరంగంగా ప్రకటించినా నేతలు మధ్య మాత్రం ఐక్యత సమన్వయం కొరవడుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతుండటం  గమనార్హం.

గెలుపుగుర్రాలపై నేతల దృష్టి

గత రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్‌‌‌‌కు కంచుకోటలా ఉన్న సిద్దిపేట బల్దియాలో గెలుపు సాధించాలంటే బలమైన అభ్యర్థులు అవసరమనే విషయాన్ని కాంగ్రెస్ ముఖ్య నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా పోటీ చేసే అభ్యర్థులతో పాటు గెలిచే అవకాశం ఉన్న వారిని గుర్తించే పనిలోపడ్డారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ముక్కోణపు పోరు జరిగే అవకాశం ఉండటంతో క్షేత్ర స్థాయిలో గెలుపు అవకాశాలున్న వారిని గుర్తించి వారికి ఇప్పటి నుంచే ప్రోత్సాహిస్తున్నారు.