- రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీని మరింత స్పీడప్ చేయడం, రాబోయే యాక్షన్ ప్లాన్‌పై ఫోకస్ పెట్టడమే లక్ష్యంగా త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి (స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్) హాజరు కావాల్సిందిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆహ్వానించారు. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కొత్త క్వార్టర్స్‌లో బుధవారం నితిన్ నబీన్ గృహప్రవేశం చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం ఆయనను రాంచందర్‌రావు మర్యాదపూర్వకంగా కలుసుకుని విష్ చేశారు. అనంతరం రాష్ట్రంలోని తాజా పొలిటికల్ పరిణామాలు, పార్టీ ఇంటర్నల్ పరిస్థితులు, సంస్థాగత బలోపేతంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా డిస్కస్ చేశారు.
టార్గెట్ 2029.. క్షేత్రస్థాయిలోకి వెళ్లండి
రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే పరమావధిగా ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవల్‌లో పార్టీని మరింత స్ట్రాంగ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని రాంచందర్ రావుకు నితిన్ నబీన్ సూచించారు. గడిచిన 12 ఏండ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణ డెవలప్‌మెంట్‌కు కేటాయించిన నిధులు, రాష్ట్రంలో గ్రౌండ్ లెవల్‌లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
కేంద్రం ఇస్తున్న ఫండ్స్, గ్రామాల వారీగా జరిగిన అభివృద్ధిపై పబ్లిక్‌లో పెద్ద ఎత్తున అవేర్‌నెస్ కల్పించేలా స్పెషల్ క్యాంపెయిన్స్ ప్లాన్ చేయాలన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై పూర్తిస్థాయి రూట్ మ్యాప్‌ను ఖరారు చేయాలని, ఇందుకు సంబంధించి పక్కా యాక్షన్ ప్లాన్‌తో రెడీ కావాలని రాంచందర్ రావుకు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు
