ఆర్టీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి..అధికారులకు రవాణా మంత్రి పొన్నం ఆదేశం

ఆర్టీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయండి..అధికారులకు రవాణా మంత్రి పొన్నం ఆదేశం
  • 11 శాతం ఫిట్‌‌‌‌మెంట్ వచ్చే నెల 1 నుంచి అమలు చేస్తం
  • ఆర్టీసీ పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష 

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు వెంటనే షెడ్యూల్‌‌‌‌ విడుదల చేయాలని అధికారులను రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజా పాలన ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా గురువారం సెక్రటేరియట్‌‌‌‌లో ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమ్మె విరమణ ఒప్పందంలో భాగంగా ఉద్యోగులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌‌‌‌మెంట్ అమలు చేయాలని ఆదేశించారు.

సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల చెక్కును, ఆయన ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల విధానం, వాటి విస్తరణపై త్వరలోనే దక్షిణ భారతదేశంలోని రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో హైదరాబాద్‌‌‌‌లో సమావేశం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 

2,815 కొత్త బస్సులు కొన్నాం..

2023 –26 మధ్య కాలంలో ప్రజా పాలన ప్రభుత్వం రూ.1,078 కోట్లతో 2,815 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏటూరు నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో రెండు కొత్త డిపోలను మంజూరు చేశామన్నారు. తార్నాక ఆసుపత్రిని ప్రాథమిక వైద్య సేవలస స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకువచ్చామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు ఉన్నారని, రోజూ 35 లక్షల కిలోమీటర్ల మేర 61 లక్షల మంది ప్రయాణికులను బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు.

నాగర్ కర్నూల్, పెద్దపల్లి బస్ డిపో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో వేములవాడ, కథలాపూర్ బస్టాండ్లకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మునుగోడు, చండూరు, మర్రిగూడ, బస్సు స్టేషన్ల పునరుద్ధరణ, నాంపల్లి బస్సు స్టేషన్ స్థల పరిశీలనపై సమీక్ష చేశారు. మధిర బస్సు స్టేషన్ పనులను వేగవంతం చేయాలని, రాష్ట్రంలో ప్రస్తుతం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, 553 బస్సులకు మహిళలను యజమానులుగా చేశామన్నారు. 

‘సర్’ పై మంత్రులు పొన్నం, అజార్ సమీక్ష

హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ‘సర్’ ప్రక్రియపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్‌‌‌‌ సమీక్ష చేశారు. గురువారం సాయంత్రం సెక్రటేరియట్‌‌‌‌లో జరిగిన సమీక్షలో ఈ రెండు నియోజకవర్గాల నేతలతో మాట్లాడారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగించకుండా బీఎల్‌‌‌‌ఏలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు.

కార్యకర్తలు ఇప్పటినుంచే జనంలోకి వెళ్లాలని, రానున్న జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులతో పాటు ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేశ్​ , నేతలు పాల్గొన్నారు.