12 ఏళ్ల పాప.. స్కూల్‌ వదిలి సన్యాసిని అయింది

12 ఏళ్ల పాప.. స్కూల్‌ వదిలి  సన్యాసిని అయింది

ఓ 12  ఏళ్ల చిన్నారి జీవితం ఎలా ఉంటుంది? బడికెళ్లడం, ఆడుకోవడం.. ఇలా ఆడుతూపాడుతూ సాగుతుంటుంది. కానీ గుజరాత్‌‌లోని సూరత్‌‌కు చెందిన ఖుషి షా.. రూటు సపరేటు. ఆమె అందరిలా కాకుండా ఇంకో దారి ఎంచుకుంది. సన్యాసిని కావాలని నిర్ణయించుకుంది. ‘సరే. చిన్న పిల్ల కదా, తల్లిదండ్రులు నచ్చజెపుతారులే’ అనుకుంటున్నారేమో. ఆమె నిర్ణయాన్ని కుటుంబం మొత్తం అంగీకరించింది. ‘దీక్ష’ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించింది. ఆరో తరగతిలో 97 శాతం మార్కులు తెచ్చుకుంది ఖుషి. గత నవంబర్​నుంచి స్కూలుకు వెళ్లడం మానేసింది. బుధవారం సన్యాసినిగా మారింది. జైన మతంలో ‘దీక్ష’ తీసుకోవడం అంటే.. వ్యక్తులు లేదా ప్రాంతాలు లేదా వస్తువులతో ఉన్న బంధం, భావోద్వేగాలను వదిలేయడం. సాధారణ జీవితం కోసమే తాను దీక్ష తీసుకున్నట్లు ఖుషి చెప్పింది.

‘‘మనం అనుభవిస్తున్న ఆనందాలు శాశ్వతం కాదు. సహనం ద్వారా వచ్చే ఆనందమే శాశ్వతం. శాంతి, మోక్షం సాధించాలంటే నిరాడంబరంగా బతకాలి. అందుకే దీక్ష తీసుకుంటున్నా” అని వివరించింది. సన్యాసం తీసుకోవడంలో తాను నాలుగేళ్లు ఆలస్యం చేశానని ఆ  చిన్నారి చెప్పడం గమనార్హం. ‘‘సీమంధర్ స్వామీజీ ప్రకారం ఎవరైనా 8 ఏళ్ల వయసులోనే ప్రాపంచిక ఆనందాలను వదిలేయాలి. ఇప్పుడు నాకు 12 ఏళ్లు. కొంచెం ముందుగానే దీక్ష తీసుకోవాల్సింది” అని చెప్పుకొచ్చింది. ఖుషి కుటుంబంలో ఇప్పటికే నలుగురు సన్యాసం తీసుకున్నారు.