భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణంలో 120 జంటలు

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిత్య కల్యాణంలో 120 జంటలు

భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన నిత్య కల్యాణంలో 120 జంటలు పాల్గొన్నాయి. శ్రావణమాసం కావడంతో రాముడికి కల్యాణం నిర్వహించడానికి భక్తులు ఆసక్తి చూపించారు. వర్షం కారణం, కల్యాణం చేయించే వారి సంఖ్య అధికంగా ఉండటంతో చిత్రకూట మండపంలో నిత్య కల్యాణాన్ని జరిపించారు. గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసిన అనంతరం, భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు.

భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల నడుమ కల్యాణమూర్తులను ఊరేగింపుగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ముందుగా స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక అనంతరం మంత్రపుష్పం సమర్పించడంతో క్రతువు ముగిసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.