గురుకుల పాఠశాలలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత

గురుకుల పాఠశాలలో 120 మంది విద్యార్థులకు అస్వస్థత

వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కలుషిత నీటితో గురుకులంలోఉన్న 600 మంది విద్యార్థుల్లో 120 మంది అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా గురుకులంలో మెడికల్ క్యాంపు నడుస్తుండడంతో విద్యార్థులు హెల్త్ చెకప్స్ కోసం క్యూ కట్టారు. టైఫాయిడ్, జ్వరం, దగ్గు, జలుబు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. మరికొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారి తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. గురుకులాన్ని కొన్ని రోజులుగా మంచినీటి సమస్య వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. గురుకులం అవసరాల కోసం వాడే నీరు దగ్గరలోని ఉన్న చెరువు మధ్యలో ఉండే బోరు బావి ద్వారా వస్తుండగా... ఆ బోరుబావి ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగిపోయింది. అదే బోరుబావి నీరే అవసరాలకోసం ఓ సంపులో స్టోరేజ్ చేస్తారు. ఆ సంపును సరిగ్గా శుభ్రపరచకుండా పసుపుబారిన అవే నీటితో విద్యార్థులు స్నానం చేయడం, వంటల కోసం వాడుతున్నారు. 
అపరిశుభ్ర నీరు వాడడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. తాగునీటి కోసం భవనం నిర్మించిననాడే వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు దాన్ని అందుబాటులోకి తేలేదు. బోరు వాటర్ నే విద్యార్థులకు అందజేస్తున్నారు. మిషన్ భగీరథ నీటి కోసం పెద్ద ట్యాంక్ కట్టారు కాని... కాని దానికీ నీటి సరఫరా లేదు. ఇదిలా ఉండగా 600 మంది విద్యార్థులున్న గురుకులంలో ఒక్క బాత్రూమ్ కూడా సరిగ్గా లేదు. విరిగిన తలుపులు, పని చేయని నల్లా పైపులు దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఆరుబయట పొలాల్లో, చెరువు గట్లపై మల విసర్జనకు వెళ్ళాల్సిన పరిస్థితి. 

గురుకులం సమస్యలపై ప్రిన్సిపాల్ ను అడగగా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. పదిహేను మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని.....  బయట తిరిగే అలవాటున్న విద్యార్థులు మళ్ళీ పాడు చేస్తారని బత్రూమ్ లు బాగు చేయించడం లేదని సమాధానమిచ్చారు. నీటి సమస్య ఎప్పటినుంచో ఉందని.... పిల్లలు అస్వస్థతకు గురవ్వడం కామన్ అని తే‌లికగా చెప్పేశాడు. గురుకులంలో నీటి సమస్య తో పాటు ఎన్నో సమస్యలున్నాయని..... ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళినా పెద్ద ప్రయోజనం ఏమి లేదని విద్యార్థులు వాపోయారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల్లో సమస్యలు చాలా ఉన్నాయని.... అధికారులు ప్రభుత్వం చొరవ చూపి సమస్యలు పరిష్కారం చేసి నాణ్యమైన విద్యను అందించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.